సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాను వదిలి ప్యాకేజీని ఏ రకంగా ఒప్పుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నించారు. నాడు అలా లొంగిపోవడంవల్లే నేడు ఏపీ ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడి విజయ్‌చౌక్‌లో ఎంపీలు బెల్లాని చంద్రశేఖర్, నందిగం సురేశ్, గురుమూర్తి, పోచా బ్రహ్మానందరెడ్డిలతో కలిసి భరత్ గురువారం మీడియాతో మాట్లాడారు. పాత ధరలకే పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వడంపై నాడు టీడీపీ సంతకం చేయడంవల్లే ఆ ఫలితాన్ని నేడు ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయితే రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని టీడీపీ అడిగి తీసుకున్న విషయాన్నీ ఎంపీ గుర్తుచేశారు. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి దశల వారీగా నిధులను విడుదల చేయాలని.. లేకుంటే ఏపీ నష్టపోతుందన్నారు. ఈ నిధులు సాధించుకునే వరకూ తాము పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని భరత్‌రామ్ తెలిపారు. దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇక విభజన చట్టం అమలులో ఉండే పదేళ్లపాటు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి న్యాయం చేయాలన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా కోసం తాము లోక్‌సభలో పోడియం వద్ద నినాదాలు చేస్తుంటే టీడీపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ఆ జిల్లాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలి
వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,050 కోట్లు మాత్రమే విడుదల చేశారని.. వాటికి కేబీకే తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని భరత్ డిమాండ్ చేశారు. సొంత ప్యాకేజీల కోసం రాష్ట్ర ప్రజల్ని టీడీపీ తాకట్టు పెట్టిందన్నారు. కరోనాపై సభలో చర్చకు అంగీకరిస్తాం కానీ.. ఇతరత్రా అంశాలను అంగీకరించబోమని ఎంపీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment