సాక్షి, మెదక్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్ చేస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల నుంచి వచ్చిన మీరు గవర్నర్ కావచ్చా? అంటూ తమిళిసైపై హరీష్ సీరియస్ అయ్యారు.
తాజాగా, మంత్రి హరీష్ రావు మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై కరెక్ట్ కాదు. ఎరుకల జాతి, విశ్వ బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరి ఎంపికను గవర్నర్ తమిళిసై అడ్డుకున్నారు. దేశంలో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఎరుకల జాతిని రిజెక్ట్ చేసింది. మీరంతా బీజేపీకి గుణపాఠం చెప్పాలి. బీజేపీలో ఉండి తమిళిసై మాత్రం గవర్నర్ కావచ్చు. కానీ, కుర్రా సత్యనారాయణ మాత్రం బీఆర్‌ఎస్‌లో ఉండి ఎమ్మెల్సీ కావద్దా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదానే లేదు..
ఎన్డీయేలో కేసీఆర్ చేరుతా అన్నారని మొన్న చెబుతున్నారు. అన్నీ జూటా మాటలు. రెండేళ్ల క్రితం కలిస్తే అప్పుడు ఎందుకు చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారు. మీతో కలవాల్సిన అవసరం లేనే లేదు. అసలు కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదానే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే. హైదరాబాద్ నుంచి మెదక్‌కు గూండాల గ్యాంగ్ పైసల కట్టలతో బయలుదేరింది. గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు నోట్ల కట్టలు గెలవాలా?. మెదక్ ఆత్మగౌరవం గెలివా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
ఇక, అంతకుముందు.. సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను హరీష్ రావు ప్రారంభించారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీఎల్ సంతోష్, బీఆర్‌ఎస్‌కు రేవంత్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment