
సమావేశంలో మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం, చిత్రంలో మంత్రి కారుమూరి
చంద్రబాబు ఎస్టేట్‌కు మేనేజర్‌లా మారావ్!
కాపులకు నువ్వు చేసిందేమిటి!
కాపు సమావేశంలో ముద్రగడ ఫైర్
తణుకు అర్బన్: చంద్రబాబు బాగుకోసమే పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ కళ్యాణ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కమ్మ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తణుకు నియోజకవర్గ కాపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని తప్పుపడుతున్న పవన్ కాపులకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలను డబ్బులకు అమ్ముడుపోయే వారిలా చిత్రీకరిస్తూ పిఠాపురంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటుకు రూ.లక్ష ఇచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారనడం బాధాకరమన్నారు.
‘క్లబ్బులు నడిపే వారితో సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్ ద్వారా నేరుగా నన్ను తిట్టవచ్చు. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ ముద్రగడ సవాల్ విసిరారు. 21 అసెంబ్లీ సీట్లకు పరిమితమై త్యాగపురుషుడిగా కీర్తి సాధించావంటూ ఎద్దేవా చేశారు. వాటిలో కూడా టీడీపీ నుంచిజనసేనకు వచ్చినవారి సంఖ్యే అధికమని తెలిపారు. ముద్రగడ భార్య చనిపోయిందని, కొడుకు చనిపోయాడని నీచాతి నీచంగా పోస్టులు పెట్టిస్తున్న నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తోందని చెప్పారు. నీచాతినీచంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తామంటూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చారని విమర్శించారు.
పవన్‌ను ఇంటికి పంపించండి
ఈ ఎన్నికల్లో పవన్‌ను రాజకీయంగా ప్యాక్ చేసి ఇంటికి పంపించాలని కాపు నాయకులకు ముద్రగడ పిలుపునిచ్చారు. పేదల పెన్నిధిగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అండగా నిలబడతామని, జగన్ చేసిన మంచే ఆయనకు రక్షగా ఉంటుందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని నిన్ను తొక్కేస్తా అంటూ ఊగిపోవడం, ఉక్రోషంగా, ఉద్రేకంగా మాట్లాడే పవన్ తీరు ఏ రాజకీయ నాయకుడికీ లేదని, రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment