
మాట్లాడుతున్న నారా లోకేశ్
గాజువాక: ‘నాడు విశాఖ ఉక్కు కోసం పోరాడింది టీడీపీనే.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు పోరాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడ్డారు. అప్పట్లో టీడీపీ ఎంపీలుగా ఉన్న ఎర్రన్నాయుడు, మూర్తి విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్‌లో పోరాడారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నది కూడా టీడీపీనే’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే అని, మరింత ఉధృతం చేస్తామన్నారు. ‘విశాఖ ఉక్కును అమ్మడానికి వాడెవ్వడు? కొనడానికి వీడెవ్వడు? ఫ్యాక్టరీ జోలికొస్తే తరిమికొడతాం.
పోస్కో గోస్కో అని వస్తే చర్మం వలుస్తాం’ అని హెచ్చరించారు. పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్లే ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల పాలైందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము సీఎం వైఎస్ జగన్‌రెడ్డికి లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కళకళలాడేదని, ఇప్పుడు కబ్జాలు, దౌర్జన్యం, విధ్వంసం, దాడులతో ప్రశాంతతే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ విజయలక్ష్మిని ఓడించారన్న కక్షతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్‌రెడ్డి అంగీకరించి, ఉత్తరాంధ్రపై కక్ష తీర్చుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.