గిద్దలూరు సీటు టీడీపీకి ఇవ్వడంపై జనసేనుల అసంతృప్తి
ఇండిపెండెంట్‌గా పోటీకి ఆమంచి స్వాములు సన్నాహాలు
ఆమంచి వైపే మెజార్టీ జనసేన
దర్శిపై చంద్రబాబు దోబూచులాట
జిల్లా జనసేనలో వర్గాల కుమ్ములాటలు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తు పారీ్టల్లో కుమ్ములాటలు ముదిరి పాకాన పడుతున్నాయి. పొత్తుల పేరుతో సీట్లు దక్కని జనసేనలు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు. జిల్లాలో పొత్తులో భాగంగా దర్శి, గిద్దలూరు నుంచి అవకాశం వస్తే పోటీ చేయాలని ఆశించారు. అయితే గిద్దలూరు సీటు టీడీపీకి కేటాయించడంపై గ్లాసు పార్టీ నేతలు భంగపడి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ పార్టీ నేత ఆమంచి స్వాములు ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమవుతున్నారు. దర్శి సీటును ఒకవేళ జనసేనకు ఇచ్చినా టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ప్రచారానికి జిల్లా జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది రెండు పార్టీల పరిస్థితి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పశ్చిమ ప్రకాశంలో కీలకమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటును జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేసి చివరికి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనక దుష్ట శక్తుల కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు.
అయితే టీడీపీ, జనసేన పొత్తుల తరువాత కూడా కొంతకాలం ఇదే కథ నడిపించారు. చివరికి గిద్దలూరు సీటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు మోసపోయినట్లు గ్రహించారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం చెందిన ఆమంచి స్వాములు జనసేన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి జనసేనలో చిచ్చు పెట్టారు. రెండు గ్రూపులను సృష్టించారు. జనసేనలో కాసుల పాండు, బెల్లంకొండ సాయిబాబు గ్రూపులు ఏర్పడ్డాయని కార్యకర్తలు మండిపడుతున్నారు.
దర్శిపై దోబూచులు..
దర్శి నియోజకవర్గంలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇది కూడా మొదట్నుంచీ జనసేనకు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఎన్నారై గరికపాటి వెంకట్ ప్రచారాన్ని సైతం చేసుకుంటూ వచ్చారు. సీటు తనకే వస్తుందని ఆశపడ్డారు. పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. అయితే ఈ సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు తనస్టైల్‌లో కుట్రలకు తెరతీశారు. దర్శిపై దోబూలాట మొదలెట్టారు. ఎల్లో మీడియా ద్వారా రోజుకో ప్రచారాన్ని చేయిస్తూ వస్తున్నారు. ఈ సీటును జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రటించినప్పటికీ దర్శిపై క్లారిటీ ఇవ్వలేదు. నోటిఫికేషన్ వచ్చి పది రోజులవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. దీంతో కూటమి పారీ్టలో నాయకులు, కార్యకర్తలు చిరాకుపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా అభ్యర్థి మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఉండేలా చంద్రబాబు తెరవెనుక మంత్రాంగం నెరపుతున్నట్టు సమాచారం.
రెబల్‌గా స్వాములు..
ఆమంచి స్వాములు ఆదివారం రాత్రి కంభంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో తెలుగుదేశం నాయకత్వంపై ఫైర్ కావడం సంచలనం సృష్టించింది. ఓడిపోయే సీట్లను జనసేనకు కట్టబెడుతున్నారని ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపాయి. జిల్లా నుంచి కనీసం ఒక్క సీటైనా జనసేనకు ఎందుకు కేటాయించలేదన్న ఆయన ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన సూచించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్వాములు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది.
జనసేనలో...గొడవలు.. గ్రూపులు
జనసేన పార్టీలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా గ్రూపులు, గొడవలతో సతమతమవుతోంది. కొండపి నియోజకవర్గంలో ఇన్చార్జి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిన రాజేష్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. ఇటీవల సింగరాయకొండలో ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒంగోలు సంగతి తెలిసిందే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వర్గాలు తరచుగా ఘర్షణ పడుతున్నారు. గత నెలలో రియాజ్ వర్గం అరుణను వెంటాడి దాడి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అరుణ తన మీద జరిగిన దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పడు తాను పొత్తుల పనిలో బిజీగా ఉన్నాను.. ఎన్నికల తరువాత కూచొని మాట్లాడుదామని చెప్పడం విమర్శలపాలైంది. యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పి.గౌతం రాజును నియమించారు. గుంటూరులో వైద్యం చేసే ఆయన ఏడాది క్రితమే ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వీలు చిక్కినప్పుడు మాత్రమే యర్రగొండపాలేనికి వచ్చిపోతున్నారు. మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో జనసేన నామమాత్రంగా ఉంది. మార్కాపురంలో ఇమ్మడి కాశీనాథ్ ఒక్కడే హోల్ అండ్ సోల్ నాయకుడిగా చెలాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment