రేపే తెలంగాణలో పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూసుకుంటే మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి (సాంకేతికంగా రెండోసారే). పైగా రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే ప్రజా తీర్పు మరోలా ఉండనుందా? అనే చర్చా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లు ఏమేర పోటెత్తుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. సగటున 67.57% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంతో 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. పైగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో కలిపే జరిగాయి. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతంలో అప్పటికి 2.81 కోట్ల ఓటర్లు ఉండగా.. దాదాపు 74 శాతం నమోదు అయ్యిందని అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సొంత రాష్ట్ర కల నెరవేరిన జోష్‌లో ఓటు హక్కు అత్యధికంగా సంఖ్యలో వినియోగించుకున్నారనే విశ్లేషణలు నడిచాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం 69.5 శాతమే ఓటింగ్ నమోదు అయ్యిందని ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.
మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ వివరాల్ని వెల్లడించిన అప్పటి ఎన్నికల అధికారి రజత్‌కుమార్ 73.20 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ప్రకటించారు. ఆ సమయంలో గ్రామీణ ఓటింగ్ ఎక్కువగా నమోదు అయ్యింది. అర్బన్ ఓటర్లు చాలావరకు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
ఇక ఇప్పుడు 2023 ఎన్నికల విషయానికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన గతంలో కంటే మెరుగ్గా జరిపినట్లు .. అలాగే ఓటు హక్కు వినియోగంపైనా అవగాహన కల్పించినట్లు చెబుతోంది. మరోవైపు దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ ఓటు ద్వారా ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు కూడా. అన్నింటికి మించి 10 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించడం గమనార్హం. ఇలా ఎలా చూసుకున్నా.. ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదు కావొచ్చని.. అందునా అర్బన్ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment