ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పూర్తి విశ్వాసంతో వై నాట్ 175 అనే నినాదం తీసుకోవడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన ఆయన స్పందన భవనంలో నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏ నారాయణమూర్తి, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్‌లతో కలిసి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్, ప్రియారిటీ ఇండికేటర్స్‌పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ, గర్భిణులు, బాలింతలు, శిశు మరణాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. పేదరిక నిర్మూలన, విద్యా, వ్యవసాయం, వైద్యం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలోని అంశాలను వివరించారు.గతంలో పలుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నవరత్నాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ నవరత్నాలు, టీఆర్‌ఎస్ పార్టీలో కొన్ని, కర్ణాటకలో మ్యానిఫెస్టోలోవి మరికొన్ని కాపీ కొట్టి చంద్రబాబు మ్యానిఫెస్టో అని విడుదల చేయడం హాస్యాస్పదం అన్నారు.
కాపీ కొట్టిన మ్యానిఫెస్టోతో చంద్రబాబు విఫలమై నవ్వులపాలయ్యాడన్నారు. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలై శ్రీలంక అవుతుందని బుకాయించిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలను ఆయన మ్యానిఫెస్టోగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ఇచ్చిన మాటల మేరకు జగన్ నవరత్నాలను అమలు చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వ్యవసాయం, వైద్యం, గృహాల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట, అధికారం వచ్చాక మరో మాట చెప్పడం ప్రజలకు తెలియంది కాదని, ఆయన్ను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వీకెండ్ పర్యటనలు పట్టించుకోమన్నారు. సిద్దాంతం, ఎజెండాలు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పాదయాత్రలు వైఎస్సార్ సీపీని ఏమీ చేయలేవన్నారు. రాష్ట్రంలో 55 శాతానికిపైగా ప్రజలు జగన్‌తో ఉన్నారని, అందుకు మున్సిపాలిటీ, జెడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పక్కా తీర్పును ఇవ్వడమే నిదర్శనమన్నారు. పవన్‌కళ్యాణ్ అమితాబ్‌తో కలిసినా, అమిత్‌షాతో కలిసినా ఒరిగేదేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment