భార్య హత్యకేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష | Sakshi
Sakshi News home page

భార్య హత్యకేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష

Published Sun, May 26 2024 7:45 AM

-

ఒంగోలు: భార్య శీలాన్ని శంకించి హత్య చేసిన కేసులో నిందితుడు కొర్రపాటి ఏడుకొండలుకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి శనివారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. తాళ్లూరు మండలం కొర్రపాటి వారిపాలెంకు చెందిన కొర్రపాటి ఏడుకొండలు.. దర్శి మండలం వీరాయపాలెంకు చెందిన సనుమూరి అంజలిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఉపాధి నిమిత్తం వీరు స్థానిక మంగమూరు రోడ్డులోని సుందర్‌నగర్‌లో అద్దె ఇంట్లో జీవనం సాగించేవారు. అనేక సార్లు అంజలి శీలాన్ని శంకించి అనేక మార్లు నిందితుడు అంజలిపై గొడవపడేవాడు. ఈ క్రమంలో 2017 అక్టోబరు 23న రాత్రి 7గంటల సమయంలో మార్బుల్‌ రాయితో అంజలి తలమీద క్రూరంగా కొట్టగా బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై అప్పటి తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. ఒంగోలు కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌ దాఖలు చేయగా జిల్లా కోర్టులో విచారణ జరిగింది. నిందితునిపై నేరం రుజువు కావడంతో నిందితుడైన మృతురాలి భర్త కొర్రపాటి ఏడుకొండలుకు యావజ్జీవ జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.వసుంధర వాదించారు.

ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్‌, పది పరీక్షలు

ఒంగోలు: ఇంటర్‌, పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 7430 మంది జనరల్‌ విద్యార్థులకుగాను 6924 మంది, 669 మంది ఒకేషనల్‌ విద్యార్థులకుగాను 614 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 487 మంది జనరల్‌ విద్యార్థులకుగాను 410 మంది, 272 మంది ఒకేషనల్‌ విద్యార్థులకుగాను 235 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తి ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆర్‌ఐవో ఎ.సైమన్‌ విక్టర్‌ తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జరిగిన హిందీ పరీక్షకు 801 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. 22 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు కేవలం 231 మంది మాత్రమే హాజరయ్యారు. 570 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో డి.సుభద్ర తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement