దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోరాటం
ఒంగోలు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పోరాడతామని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు పేర్కొన్నారు. స్థానిక ఎన్‌జీవో భవన్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా పాస్టర్ల సంఘం సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా అందని ద్రాక్షగా చేశాయన్నారు. ప్రస్తుతం ఈ విషయమై వేసిన కేజీ బాలకృష్ణ్ణన్ కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణని తాను స్వయంగా గంటన్నరపాటు ఆయన నివాసంలో కలిసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి రికమండేషన్ సమర్పించాలని కోరినట్లు చెప్పారు. దళిత క్రైస్తవులను చైతన్యపరిచి ఎస్సీ హోదా సాధన వైపు ఏకతాటిపై నడిపించేందుకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధపరచడానికి నవంబరులో పది లక్షల మందితో ఒంగోలులో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. మనదేశంలోని అగ్రకులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారు ఓసీలుగానే పరిగణిస్తారని, బీసీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీలు గానే, ఎస్టీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్టీలుగానే పరిగణిస్తారని, కానీ 75 ఏళ్లుగా దళితులు క్రై స్తవ మతాన్ని స్వీకరించినట్లయితే ఎస్సీలుగా పరిగణించకుండా అన్యాయం చేస్తూనే ఉన్నారన్నారు. మతం మారినా కులం మారదని, వారి ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతుల్లో మార్పు ఉండదని తెలిసినా అన్యాయం కొనసాగుతూనే ఉందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పది లక్షల మందితో సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బిషప్ సాంసన్, పాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఎస్ ఐజక్ బాబు, మన్న చర్చి సుదర్శన్, పాలపర్తి విజేష్ రాజు, ప్రసాద్ బాబు, లివింగ్ స్టన్, కొడవటిగంటి సామ్రాట్, ఈ శామ్యూల్ కృపాకర్, ఎద్దు శశి భూషణ్ గారు, స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్, దళిత్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
నవంబరులో పది లక్షల మందితో ఒంగోలులో బహిరంగ సభ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దపాటి విజయరాజు
Comments
Please login to add a commentAdd a comment