ఒంగోలు అర్బన్: జిల్లా అభివృద్ధిపై నిర్వహించే డీఆర్‌సీ (జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ) సమావేశం కూటమి ప్రభుత్వంలో తొలిసారి సోమవారం నిర్వహించనున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, తాగునీరు, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ శాఖలకు సంబంధించి డీఆర్‌సీ సమావేశంలో చర్చించనున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి చేయలేదు. గత ప్రభుత్వంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా వంటి పథకాలతో అండగా నిలిచారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో ప్రాథమిక వైద్యశాలలు నాడు–నేడు కింద అభివృద్ధి చేసి అన్నీ వసతులను సమకూర్చారు. జిల్లాలోని మెడికల్ కాలేజీకి పీజీ సీట్లను పెంచడంతో పాటు మార్కాపురంలో కొత్త మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు. రెవెన్యూ శాఖకు సంబంధించి వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలు టీడీపీ ప్రభుత్వంలో చుక్కల భూములుగా, ప్రభుత్వ భూములుగా మారడంతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారు. రీసర్వేతో భూముల సమస్యలను శాశ్వతంగా తొలగించడంతో పాటు శాశ్వతంగా రికార్డులు ఉండేలా అధునాతన టెక్నాలజితో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిర్వహించే తొలి డీఆర్‌సీలో కొత్తగా ఏ అభివృద్ధి పనులపై చర్చిస్తారో చూడాలి. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో డీఆర్‌సీ సమావేశం ఒక్కటి కూడా నిర్వహించలేదు. దీన్ని బట్టి టీడీపీ ప్రభుత్వానికి జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వరకు మొత్తం ఏడు సార్లు డీఆర్‌సీ సమావేశాలు నిర్వహించి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment