జిల్లా కేంద్రం ఒంగోలులో గత 30 ఏళ్లుగా రేషన్ షాపు నిర్వహిస్తున్న ఒక మహిళ షాపును ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లి వారే అదనపు బియ్యం బస్తాలను ఆమె ముందు నుంచే షాపులో దింపి, కేసు నమోదు చేస్తున్నామని రిపోర్టు రాశారు. దానిపై సంతకం చేయాలని ఆ ఒంటరి మహిళపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆ మహిళ తమ పిల్లలతో సహా స్థానిక ఎమ్మెల్యేను కలిసి తన షాపును వదిలిపెట్టాలని బతిమిలాడినా ఒప్పుకోలేదు. చివరకు రాజీనామా చేస్తేనే కేసు లేకుండా వదిలేసి ఆ షాపును టీడీపీకి చెందిన వారికే కేటాయించారు.
● ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు మండలం రూరల్, అర్బన్‌లో మొత్తం 102 రేషన్ షాపులు ఉన్నాయి. వాటిలో దాదాపుగా 95 రేషన్ షాపులు పాత వారితో బలవంతపు రాజీనామాలు చేయించి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టారు. అదేవిధంగా కొత్తపట్నం మండలంలో 36 రేషన్ షాపులు ఉంటే వాటిలో ఇప్పటికే 18 షాపులు పాతవారిని రద్దు చేసి కూటమి నేతలకు అప్పగించారు.
● సింగరాయకొండలో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న 4 రేషన్ షాపుల డీలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించారు. వీటిలో ఒక పర్మినెంట్ షాపునకు సంబంధించి ఒక డీలర్ అప్పటికే అనారోగ్యంతో ఉండగా ఈ బలవంతపు రాజీనామాతో తీవ్ర మనస్థాపం చెంది మరణించాడు. చివరికి ఎస్‌టీ సామాజికవర్గానికి చెందిన డీలర్లను కూడా వదిలిపెట్టలేదు. వారితోను బలవంతపు రాజీనామాలు చేయించి రేషన్ షాపులను కూటమి వ్యక్తులకు ధారదత్తం చేశారు.
● యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 173 రేషన్ షాపులు ఉంటే వాటిలో 143 షాపులకు సంబంధించి పాత డీలర్లను మార్చి టీడీపికి చెందిన వారికి కట్టబెట్టారు.
● మార్కాపురం పట్టణంలో మొత్తం 32 రేషన్ షాపులు ఉంటే వాటిలో 24 మంది డీలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించి టీడీపీ నాయకులకు అప్పగించారు. అదేవిధంగా మార్కాపురం మండలంలో మొత్తం 61 షాపులు ఉంటే 49 మంది డీలర్లు రాజీనామా చేయించి కూటమి పార్టీలకు చెందిన వారికి ఇచ్చారు.
● సీఎస్‌పురం మండలంలో మొత్తం 35 రేషన్ షాపుల్లో 32 షాపులు పాత డీలర్లను తొలగించి కొత్తవారికి అప్పగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
● తర్లుపాడు మండలంలో మొత్తం 19 రేషన్ షాపులుంటే వాటిలో 9 పర్మినెంట్ షాపులు ఉన్నా యి. మొత్తం 11 రేషన్ డీలర్లతో బలవంతపు రాజీనామాలు చేయించి వారిని రోడ్డుపాలు చేశారు.
● పామూరు మండలంలో మొత్తం 44 రేషన్ షాపులకు సంబంధించి 22 మందితో రాజీనామాలు చేయించి కొత్త వారికి కేటాయించారు.
● కురిచేడు మండలంలో మొత్తం 26 రేషన్ షాపులు ఉంటే వాటిలో 23 షాపులు పాత డీలర్లను తొలగించి కొత్త వారికి ఇచ్చారు.
● దర్శి మండలంలో 36 రేషన్ షాపులు ఉంటే టీడీపీ నాయకులు 30 మంది డీలర్ల చేత దౌర్జన్యంగా సంతకాలు చేయించి షాపులు లాక్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment