కబడ్డీ క్రీడకు మరింత వన్నె తేవాలి
● ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి
ఒంగోలు: నూతన కార్యవర్గం కబడ్డీ క్రీడకు మరింత వన్నె తీసుకురావాలని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి అన్నారు. స్థానిక ఆస్టోనా ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎంపికకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కబడ్డీ క్రీడకు పెట్టింది పేరన్నారు. జిల్లాల విభజన తరువాత తొలిసారిగా 26 జిల్లాలకు 26 అసోసియేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, ప్రకాశం జిల్లాలో కబడ్డీని బలోపేతం చేయడంలో నూతన కార్యవర్గానికి అత్యంత బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి వై.శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలోనే నేడు కబడ్డీ నెంబర్ 2 స్థానంలో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోందన్నారు. ప్రస్తుతం ప్రో కబడ్డీ సీజన్ నడుస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా కబడ్డీ లీగ్ కూడా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ లీగ్ ద్వారా క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు వస్తాయని, ప్రకాశం జిల్లానుంచి అంతర్జాతీయ క్రీడాకారులు గతంలో ఉన్నారని, మళ్లీ అటువంటి క్రీడాకారులను తయారుచేసి ప్రోకబడ్డీలో సైతం ప్రకాశం సత్తా చాటుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ నల్లూరి సుబ్బారావు ఇక నుంచి ప్రతి ఏటా జిల్లాలో జరిగే కబడ్డీ క్రీడల నిర్వహణకు రూ.2 లక్షలు అందిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు అన్ను వేణుగోపాల్ మాట్లాడుతూ తమిళనాడు ప్రీమియర్ లీగ్ తరహాలో తెలుగు కబడ్డీ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రా అసోసియేషన్ల మధ్య చర్చ నడుస్తోందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తారన్నారు. అనంతరం నూతన కార్యవర్గ ఎంపిక ప్రక్రియకు ఎన్నికల అధికారిగా హాజరైన హైకోర్టు రిటైర్డ్ జడ్జి జె.రామారావు ఎన్నికల నిబంధనలు వివరించి నూతన ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు.
జిల్లా అధ్యక్షునిగా కుర్రా భాస్కరరావు:
చైర్మన్‌గా ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్‌గా డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అధ్యక్షునిగా కుర్రా భాస్కరరావు, సీనియర్ ఉపాధ్యక్షుడిగా సిరిగిరి రంగారావు, ఉపాధ్యక్షునిగా కె.ప్రసాదరావు, ఈదర వెంకట సురేష్‌బాబు (చిన్నారి), ఆరికట్ల సుమతి, దయానంద్, జి.శ్రీనివాసరావు, కోశాధికారిగా డి.రమేష్, కార్యదర్శిగా వై.పూర్ణచంద్రరావు, సీనియర్ జాయింట్ సెక్రటరీగా ఎం.హనుమంతరావు, జాయింట్ సెక్రటరీలుగా పి.హజరత్తయ్య, ఇజ్రాయేల్, కార్యనిర్వాహక సభ్యులుగా పి.అంకబాబు, కె.శ్రీలక్ష్మి, వై.కన్నయ్య, కె.హనుమంతరావు, ఎం.వీరాస్వామి, ఎండి హజీరాబేగం, శివ సిసింద్రి, తోట బాలాంజనేయులు, వై.బాలగురవయ్య, పి.దామోదర్‌రెడ్డి, ఎ.రవికిరన్, వై.బాబు, కె.మల్లికారాణి, ఎం.మోహన్‌రావు, రమణారెడ్డిని ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment