ఒకేచోట పింఛన్ల పంపిణీ
● టీఎన్‌టీయూ ప్రకాశం జిల్లా అధ్యక్షుడి నిర్వాకం
ఒంగోలు టౌన్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సొంత నియోజకవర్గంలో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా గ్రామంలోని ఒకే చోట పంపిణీ చేశారు. సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ మల్లికార్జున నగర్ ఎస్టీ కాలనీ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన అర్రిబోయిన రాంబాబుతో పాటుగా మరో ఇద్దరు ఉపాధ్యాయులను పింఛన్ల పంపిణీ విధులు కేటాయించారు. రాంబాబు టీడీపీ అనుబంధ సంస్థ అయిన టీఎన్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన శానంపూడి గ్రామంలోని రాముల వారి గుడి సెంటర్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేయాల్సి ఉండగా ఆయన మాత్రం ఒకచోట ఉండి లబ్ధిదారులను అక్కడకు పిలిపించుకుని పింఛన్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. ఇదిలా ఉండగా ఒంగోలులో 10 మంది బధిరులకు పింఛన్లు పంపిణీ చేయలేదు. గత నెలలో కూడా వారికి పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల మనసు కరగలేదు. ఒంగోలు మండలంలోని కరవదిలో 20 మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు కూడా పింఛన్లు ఇవ్వలేదు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడిని ఒకసారి కలవమని ఒక ఉద్యోగి ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,88,144 మందికి గాను 2,79,365 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. మొత్తం 97.02 శాతం పంపిణీ చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment