క్రీడా స్ఫూర్తి అలవరచుకోవాలి
ఒంగోలు టౌన్: పోలీసులంతా క్రీడా స్ఫూర్తి అలవరచుకోవాలని, గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2024ను ప్రారంభించారు. ప్రారంభ వేడుకల్లో బెలూన్లు ఎగురవేశారు. గత స్పోర్ట్స్ మీట్‌లో వ్యక్తిగత చాంపియన్‌షిప్ సాధించిన కాటం శ్రీను క్రీడా కాగడాను ఎస్పీకి అందజేయగా, జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్‌ను 16, 17 తేదీల్లో వ్యక్తిగత, జట్టు విభాగాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అథ్లెటిక్స్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, క్రికెట్ ఆటలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో ప్రత్యర్థులు అనే మాటకు తావులేదన్నారు. ఏడాదిలో 365 రోజులు పనిలో ఒత్తిడిని అధిగమిస్తూ విధులు నిర్వర్తించే పోలీసులకు క్రీడలు ఊరటనిస్తాయన్నారు. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. సమన్వయం, సమయస్ఫూర్తి ఉంటేనే విజయం సాధించడం సులువవుతుందన్నారు. క్రమశిక్షణ అలవరచుకునేందుకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. క్రీడలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, ఎస్బీ డీఎస్పీ సురేష్‌బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
పోలీసులకు ఎస్పీ దామోదర్ పిలుపు జిల్లా పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2024 ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment