అంగన్‌వాడీలకు అన్యాయం చేస్తున్నారు
● ప్రభుత్వ తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ధర్నా
ఒంగోలు టౌన్: అంగన్‌వాడీ వినీ వర్కర్లతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటూ సెలవులు, వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు .మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్త, హెల్పర్ బాధ్యతలను ఒక్క మినీ వర్కర్ చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాప్‌లు, ఎఫ్‌ఆర్‌ఎస్, ఈకేవైసీలతో మారుమూల గ్రామాల్లో సిగ్నల్ అందక అంగన్‌వాడీలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అంగన్‌వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. మినీ వర్కర్లకు సెలవులు ఇవ్వడం లేదని, సమాన వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబించడం శ్రామిక మహిళల పట్ల టీడీపీ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోందన్నారు. అంగన్‌వాడీల పట్ల ఇదే వైఖరి అవలంబిస్తే మరో చారిత్రాక పోరాటానికి సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా నాయకుడు రాయళ్ల మాలకొండయ్య హెచ్చరించారు. మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. యూనియన్ నాయకురాలు కె.సుబ్బమ్మ అధ్యక్షత వహించిన ధర్నాలో యూనియన్ నాయకులు ఎన్.ధనలక్ష్మి, మున్నా, జయప్రద, సౌజన్య, డి.పద్మావతి, రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment