క్రీడా ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
● విద్యార్థులకు ఏకే విశ్వవిద్యాలయం వీసీ మూర్తి పిలుపు
ఒంగోలు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి క్రీడా ఫలాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ డీవీఆర్ మూర్తి పిలుపునిచ్చారు. శనివారం యూనివర్శిటీ కాలేజీ ఆవరణలో యూనివర్శిటీ పరిధిలోని అంతర్ కళాశాలల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆటల్లో నైపుణ్యాలు ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు గడించాలని సూచించారు. ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరిధిలోని క్రీడాకారులకు యూనివర్శిటీ తరఫున ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్క విద్యార్థి క్రీడా ఫలాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంధ్రకేసరి యూనివర్శిటీ తరఫున క్రీడల్లో రాణించి పతకాలు సాధించిన క్రీడాకారులకు చదువుకు సంబంధించి 25 శాతం మార్కులను బోనస్‌గా ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే సమయంలో ఉత్తమ క్రీడాకారులకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ తరఫున స్పోర్ట్స్ స్కాలర్‌షిప్పులు కూడా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్య, ఉద్యోగ రంగాలలో కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచిందన్నారు. అనంతరం జరిగిన జూడో పోటీలకు ఐయూటీ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉలవపాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గంటా సాయి సురేష్, డాక్టర్ బి.రమేష్‌బాబు, తదితరులు వ్యవహరించారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పోటీలు జరగ్గా, వివిధ విభాగాలలో విజేతలైన క్రీడాకారులకు వీసీ ప్రొఫెసర్ మూర్తి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవీవరప్రసాద్, జూడో అధ్యక్షుడు ఖాజా, సీడీసీ డీన్ ప్రొఫెసర్ జి.సోమ శేఖర, వ్యాయామ విద్య విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment