ఒక చేత్తో బైకులు.. మరో చేత్తో గంజాయి
ఒంగోలు టౌన్: ఒక చేత్తో బైకులు కొట్టేస్తూ.. మరో చేత్తో గంజాయి విక్రయిస్తూ ఎడాపెడా దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఒంగోలు నగరంలో వరుసగా బైకుల దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. స్థానిక సీఎస్‌ఆర్ శర్మ కాలేజీ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం వన్‌టౌన్ సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి వెళ్లారు. పోలీసులను చూసిన ఆగంతకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మోటారు బైకుల దొంగతనాల విషయం బయటపడింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. కందుకూరు పట్టణంలోని బండపాలేనికి చెందిన కుంచాల శివ్రపసాద్ ప్రస్తుతం హైదరబాద్‌లోని చందానగర్‌లో నివాసం ఉంటున్నాడు. కందుకూరు మండలంలోని దూబగుంట గ్రామానికి చెందిన ఉప్పు శ్రీకాంత్, ఒంగోలులోని కొణిజేడు బస్టాండు వద్ద నివాసం ఉంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సహౌద్దిన్ సర్దార్‌తో కలిసి జిల్లాలో 15 మోటారు బైకులు దొంగలించినట్లు ఒప్పుకున్నారు. అంతేగాకుండా బాపట్ల జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 16 మోటారు బైకులను దొంగతనం చేసినట్లు తెలిపారు. మొత్తం 33 మోటారు బైకుల విలువ రూ.25,80,000 కాగా, వారి నుంచి రూ.26 లక్షల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్‌ఐలు సురేష్, నాయబ్ రసూల్, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.సాయి, విజయకుమార్, కానిస్టేబుల్ అనిల్‌ను ఎస్పీ అభినందించారు.
వన్‌టౌన్ పోలీసు స్టేషన్ తనిఖీ...
వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ తనిఖీ చేశారు. స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మ్యాప్‌ను పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రివేళల్లో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని, 112 కాల్స్‌పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ నాగరాజు ఉన్నారు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్
Comments
Please login to add a commentAdd a comment