కాలిన కార్మికుల గుడిసెలు
● దాదాపు రూ.5 లక్షల ఆస్తి నష్టం
● పనికి వెళ్లడంతో తప్పిన ప్రాణ నష్ణం
● ఆదుకోవాలని కార్మికుల వేడుకోలు
సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని సాయినగర్ కార్గిల్లేక్ సమీపంలో ఆదివారం కార్మికుల గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాలు.. సాయినగర్‌లో మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన కార్మికులు భవన నిర్మాణ పనుల కోసం వచ్చి దాదాపు 16 గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. రోజువారీగా కూలీలు పని వెళ్లిన సమయంలో ఓ గుడిసె నుంచి మంటలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఒకదాని నుంచి మరో గుడిసెకు మంటలు వ్యాపించడంతో అక్కడున్న గుడిసెలన్నీ అంటుకున్నాయి. నిత్యవసర సరుకులు, బట్టలు, వంట సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఆస్తి నష్టం రూ.5 లక్షల వరకు ఉంటుందని సిరిసిల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ పేర్కొన్నారు.
16 కుటుంబాలం పని కోసం ఉన్నాం..
ఇక్కడ మాకు సంబంధించి 16 కుటుంబాలు ఉన్నాయి. మా గుడిసెలు కాలిపోయినట్లు కొందరు తెలిపితే పని నుంచి పరుగుపరుగున వచ్చాం. గుడిసెలన్నీ కాలిపోయాయి. మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా అన్ని కాలిపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం.
– రాజేశ్, వలస కూలీ, ఛతీస్‌గఢ్
ప్రభుత్వం ఆదుకోవాలి
పని కోసం వచ్చిన కూలీల ఇళ్లు కాలిపోయాయి. వెంటనే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు వారికి పునరావాస చర్యలు చేపట్టాలి. కనీసం ఉండడానికి స్థలం ఇచ్చి, నిత్యవసరాలు అందించాలి. నివాసం ఉండే స్థావరాలు కాలిపోవడం బాధాకరం.
– రాజు, సిరిసిల్ల
దర్యాప్తు చేస్తున్నం
కార్మికుల గుడిసెలు కాలిపోవడానికి కారణాలు స్పష్టంగా చెప్పలేం. వారందరూ రోజువా రీ వంటకు కట్టెల పొయ్యి వాడుతారు. అలా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుగుతుంది. అయితే ప్రమాదంలో నిత్యవసరాలు మాత్రమే కాలిపోయాయి. కార్మికులందరూ పనికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
– నరేందర్, సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment