ప్రచార పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రచార పాట్లు

Published Tue, May 7 2024 7:00 PM

ప్రచార పాట్లు

ఓట్ల ఫీట్లు..

షాద్‌నగర్‌: క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే..

రద్దీ ప్రాంతాలే ప్రచార అడ్డాలు

ఉపాధి పని వద్దకు ఉదయపు నడక

పొలం బాట పడుతున్న నేతలు

కూలీలు పని చేసే చోట ఓట్ల అభ్యర్థన

షాద్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎక్కడుంటే అక్కడికే వెళ్తున్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న నేపథ్యంలో నేతలు కూలీలు పని చేసే ప్రాంతాలకు వరుస కడుతున్నారు. వారితో కలిసి పని చేస్తూ.. తట్టా, బుట్టా మోస్తూ, కూరగాయలు కోస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

వారికి ఉపాధి.. వీరికి ప్రచార పరమావధి

జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చాలాగ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు 8 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు వంద నుంచి మూడు వందల మంది కూలీలు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. చెరువుల్లో పూడిక తీత, కందకాల తవ్వకం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో నాయకులు ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మార్చుకుంటున్నారు.

రైతన్న.. నీ ఓటు మాకేనన్న

యాసంగి పంటలు కోతలు జరుగుతున్నాయి. గ్రా మాల్లో చాలా మంది రైతులు వ్యవసాయ పొలాల వద్ద పంట కోతల్లో నిమగ్నమయ్యారు.తెల్లవారింది మొదలు సాయంత్రం వరకు పొలాల వద్దే ఉంటున్నారు.దీంతో నేతలు ప్రచారాల కోసంపొలం బాట పడుతున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతులను కలుస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కృషి చేస్తుందని వారికి హామీల వర్షం కురిపిస్తున్నారు.

ఆట.. ఓట్ల వేట

వేసవి సెలవులు కావడంతో ఉదయం, సాయంత్ర వేళల్లో పట్టణాలు, గ్రామాల్లో క్రీడా మైదానాలు కిటకిటలాడుతున్నాయి. కొందరు వ్యాయామాలు, నడకకు వెళ్తే, యువత క్రికెట్‌ టోర్నమెంట్లలో నిమగ్నం అవుతోంది. దీంతో నాయకులు క్రీడా మైదానాలను ఎంచుకొని అక్కడికి వెళ్తూ వారితో సరదాగా ఆటలు ఆడుతూ.. వ్యాయామాలు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు, చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

 
Advertisement
 
Advertisement