శాంతిని నెలకొల్పడంలో పీస్ కమిటీ సభ్యులు కీలకం
బంజారాహిల్స్: పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు నగరంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం నగరంలోని అన్ని జోన్లకు చెందిన సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలో ఇటీవల జరిగిన మతపరమైన సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడడంలో స్థానిక పోలీసులకు పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు అవిశ్రాంత కృషిని కొనసాగించాల్సిందిగా కోరారు. పీస్ వెల్ఫేర్ కమిటీలో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పీస్ కమిటీ సభ్యులకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని, ఏదైనా శాంతిభద్రతల సమస్య వచ్చినప్పుడు పీస్ వెల్ఫేర్ కమిటీల ద్వారా సమస్యను సలువుగా పరిష్కరించవచ్చని చెప్పారు. వివిధ మత సమూహాల మధ్య అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పోలీసులకు మద్దతుగా ఉంటామని, రాబోయే పండగలను శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా, సమాజంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్మూలించడానికి, ప్రజల్లో మత సామరస్య భావన, ఐక్యత నెలకొల్పే విధంగా కమ్యూనిటీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామని ఈ సందర్భంగా పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ చైతన్యకుమార్, సౌత్‌జోన్ డీసీపీ స్నేహమెహ్రా, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ జనరల్ సెక్రటరీ కిషన్‌శర్మ, హఫీజ్ ముజాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
నగర సీపీ సీవీ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment