సర్వేపై అపోహలు వద్దు
మహేశ్వరం: సమగ్ర కుటుంబ సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మన్సాన్‌పల్లిలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేసేందుకే ఇంటింటి సర్వే చేపడుతోందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని సూచించారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి, ఎన్యుమరేటర్‌కు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సర్వేలో ఏ ఒక్క కుటుంబాన్నీ విడిచి పెట్టొద్దని, అన్ని కుటుంబాల వివరాలు సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యులు ఓపీ రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నారా.. రోగులకు వైద్య సేవలు అందించి సరైన మందులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు సమయ పాలన పాటించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట గదిని పరిశీలించి వంటలను రుచి చూశారు. విద్యార్థులతో మాట్లాడి డిజిటల్ టీవీని వారితో ఓపెన్ చేయించారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ఎంత మంది 10 జీపీఏ సాధిస్తారో వారందరికీ రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ శైలజ, ఎంపీఓ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ కస్నా నాయక్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment