వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
కడ్తాల్: మండలంలోని కొండ్రిగాన్‌బోడ్ పంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డి చెరువుతండాకు చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నేనావత్ వెంకటయ్యనాయక్‌కు భార్య శాంతితో పాటు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 23న కుటుంబ విషయంలో భార్యతో గొడవ పడ్డాడు. తన బైక్, సెల్‌ఫోన్ ఇంట్లో వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా వెంకటయ్యనాయక్ వెళ్లిపోయాడు. ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. ఈ మేరకు ఆదివారం ఆయన భార్య శాంతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
చేవెళ్ల: ప్రమాదవశాత్తు ఓ ఇళ్లు దగ్ధమైన సంఘటన చేవెళ్ల మండలంలోని చనువెల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఫైర్‌సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాజుద్దీన్‌కు చెందిన ఇంట్లో వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం శీలపురానికి చెందిన దశరథ్ అద్దెకు ఉంటున్నారు. కాగా ఆదివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. రాత్రి ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. ఎవరూ లేకపోవటంతో వేగంగా వ్యాపించాయి. దూలాలకు అంటుకొని బయటికి పొగలు రావడంతో గ్రామస్తులు గమనించి ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ అధికారి రవీందర్‌రెడ్డి, తన సిబ్బందితో వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఇల్లు మొత్తం ఖాళీ బూడిదయ్యింది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ విషయం దశరథ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించటంతో గ్రామానికి బయలు దేరారు. రూ.1.50లక్షల నగదు, 6 తులాల బంగారం ఇంట్లో ఉందని తెలిపారు. ఆస్తినష్టం ఏ మేరకు జరిగిందో తెలియాల్సి ఉంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పురాణాలతో యువత ప్రేరణ పొందాలి
వెంగళరావునగర్: యువత పురాణాల ద్వారా ప్రేరణ పొందాలని, ప్రతి ఒక్కరూ తమ లోపల దాగి ఉన్న అంతర్గత శక్తిని వినియోగించుకోవాలని ఆర్మేనియా, సూడాన్, పోలాండ్ దేశాల అంబాసిడర్ డాక్టర్ దీపక్ ఓహ్రా అన్నారు. వెంగళరావునగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ దీపక్ ఓహ్రా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. ఇప్పటికే ఇండియా అన్ని రంగాల్లో అంతర్జాతీయ నాయకత్వాన్ని ప్రదర్శిస్తుందని, గతంలో మనం కోల్పోయిన సంపదను తిరిగి సాధిస్తున్నామని, ఇది మనకెంతో గర్వకారణమన్నారు. నలందా ప్రధాన నినాదం ‘వుయ్ రూల్’ స్కూల్ నినాదంలా కాకుండా యువతీ యువకులు గ్లోబల్ నినాదంగా మార్గనిర్దేశం చేయాలన్నారు. అనంతరం ఆయనను నలందా విద్యాసంస్థల చైర్మన్ మంతెన శ్రీనివాసరాజు, వైస్ చైర్మన్ సూర్యకాశ్యప్ వర్మ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ మూర్తి దేవరభట్ల, డాక్టర్ రమణ దేవరకొండ, డాక్టర్ రాంబాబు, స్కూల్ టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సీఐఐ 5కే వాకథాన్
మాదాపూర్: సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భగా 5కే వాకథాన్‌ను నిర్వహించారు. ఐజీబీసీ కార్యాలయం నుంచి హైటెక్స్ వరకు కొనసాగిన ఈ వాకథాన్‌లో సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ బిల్డింగ్ పితామహుడు స్వర్గీయ ప్రేమ్‌సిజైన్ కు నివాళులర్పించారు. ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వాకింగ్ దైనందిన జీవితంలో భాగం కావాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో సీఐఐ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. ఆనంద్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శ్రీనివాస్‌మూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment