రసూల్‌పురా: తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న రాత్రి పలు దుకాణాల షట్టర్లు తెరిచి చోరీలకు పాల్పడిన కేసులో ఓ మైనర్‌తో పాటు మరో ఇద్దరు దొంగలను నార్త్‌జోన్ ప్రత్యేక క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఓ ఆయుధం, షట్టర్ లిప్ట్ చేసే ఇనుపరాడ్డు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ పాముల బస్తీకి చెందిన రాజేందర్ సింగ్, బాన్స్‌వాడకు చెందిన బండా సింగ్, మరో మైనర్ (17)తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 19న రాత్రి వీరు కార్ఖాన, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 షాపుల షట్టర్ల తాళాలు పగులగొట్టి నగదు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏసీపీ రమేష్ నేతృత్వంలో తిరుమలగిరి సీఐ నాగరాజుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వంద సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు నిజామాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆదివారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చేతికి గ్లౌవ్స్..ముఖానికి మాస్క్..
చోరీలు చేసేందుకు నగరానికి వచ్చే వీరు సిటీకి చేరుకోగానే బైక్‌లు చోరీ చేస్తారు. సదరు బైక్‌లపై తిరుగుతూ వ్యాపార సముదాయాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న షాపులపై రాత్రి వేళల్లో పంజా విసిరేవారు. వేలి ముద్రలు దొరక్కుండా చేతికి తొడుగులు, ముఖాలకు మాస్క్‌లు ధరించేవారు. పథకం ప్రకారం షట్టర్లు లిప్ట్ చేసి చోరీలకు పాల్పడే వీరు పని పూర్తయిన వెంటనే బైక్‌లు, ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లకు చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్‌కు చేరుకునేవారు. తిరుమలగిరి, కార్ఖానా పీఎస్‌ల పరిధిలో చోరీలకు ముందు వీరు గాంధీ హాస్పిటల్ పార్కింగ్‌లో బైక్ దొంగిలించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరికి 23 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. కేసును చేధించిన పోలీసులను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment