అక్రమ ఆయుధాలన్నీ అక్కడి నుంచే..
బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తుపాకుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా సాగుతోంది. నగరానికి సరఫరా అవుతున్న నాటు తుపాకుల్లో దాదాపు 90 శాతం ఈ ప్రాంతాల నుంచి ‘దిగుమతి’ చేసుకుంటున్నవే. బిహార్‌లోని గయ ప్రాంతంలో తయారవుతున్న నాటు తుపాకులు సేఫ్టీ లాక్‌తో రూపొందుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కేవలం కంపెనీ మేడ్ రివాల్వర్స్, పిస్టల్స్‌కు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది. బిహార్ నుంచి నగరానికి సరఫరా అవుతున్న వాటిలో ఆటోమేటెడ్, సెమీ–ఆటోమేటెడ్ రకాలు ఉంటున్నాయనేది ఆందోళన కలిగించే అంశం. .32 లాంటి క్యాలిబర్స్ మాత్రమే కాకుండా... కేవలం డిఫెన్స్, పోలీసు శాఖలు మాత్రమే వాడే ప్రొహిబిటెడ్ బోర్‌గా పిలిచే .9 ఎంఎం తుపాకులు, తూటాలు నాటు పద్ధతిలో తయారవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం రివాల్వర్లు, పిస్టళ్లు మాత్రమే కాదు.. వీటితో పాటు డబుల్ బ్యారెల్, సింగిల్ బ్యారెల్ తుపాకులు సైతం బిహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చేరుతున్నాయని తెలుస్తోంది.
ప్రత్యేక ముఠాలతో అక్రమ రవాణా..
● నగరానికి ఆయా రాష్ట్రాల నుంచి తుపాకులు సరఫరా చేయడానికి ప్రత్యేక ముఠాలు పని చేస్తున్నాయి. అక్కడి కరడుగట్టిన ముఠాలు వీటిని అందిస్తున్నాయి. వీరికి రైలు మార్గం ఓ వరంగా మారింది. జనరల్ బోగీల్లో తనిఖీలు అంతంత మాత్రంగా ఉండటంతో వీటిలోనే ఆయుధాలు రవాణా చేస్తున్నాయి. వీటికి తోడు ట్రాన్స్‌పోర్ట్ లారీలు, కొన్నిసార్లు ప్రైవేట్ బస్సుల్లోనూ ఇవి నగరానికి వస్తున్నాయి. ఓ పక్క ముఠాలే కాకుండా.. అక్కడి నుంచి వచ్చే దినసరి కూలీలు సైతం ఆయుధ వ్యాపారాన్ని అదనపు ఆదాయ మార్గంగా భావిస్తున్నారు.
● పనుల కోసం నగరంలో స్థిరపడిన బిహారీలు రాకపోకలు సాగించే సమయంలో తమతో పాటు కొన్ని ఆయుధాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పాతబస్తీతో పాటు శివార్లలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీటిని విరివిగా విక్రయిస్తున్నారు. ఈ ఆయుధాల సరఫరా మూలాలను కనుక్కోవడంలో పోలీసు నిఘా అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఓ ముఠా దొరికినప్పుడు వారిని అరెస్టు చేయడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఎవరైనా చొరవ తీసుకుని కాస్త ముందడుగు వేసి దర్యాప్తు కోసం రాష్ట్రం దాటినా.. వారికి అక్కడి పోలీసుల నుంచి సరైన సహకారం అందుతుందని ఆశించలేం. ఒక్కోసారి ఎదురుదాడులు జరిగే పరిస్థితి ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ పరిస్థితులు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తి ఉన్న అధికారులు సైతం మిన్నకుండిపోవాల్సి వస్తోంది.
● 15.01.2025: ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేకృష్ణ బిహార్ నుంచి మూడు తుపాకులు, పది బుల్లెట్లు ఖరీదు చేసుకుని నగరానికి చేరుకున్నాడు. ఇక్కడి నేరగాళ్లకు విక్రయించే ప్రయత్నాల్లో రాచకొండ ఎస్వోటీ పోలీసులకు చిక్కాడు.
● 16.01.2025: కర్ణాటకలోని బీదర్‌లో ఎస్‌బీఏ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ ఏజెన్సీ వాహనంపై బిహార్ దొంగలు విరుచుకుపడ్డారు. అక్కడ రూ.87 లక్షలు దోచుకుని అఫ్జల్‌గంజ్ చేరుకుని, ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్‌పై కాల్పులు జరిపారు.
● 01.02.2025: తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్ గచ్చిబౌలిలో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఇతడి నుంచి పోలీసులు ఏకంగా మూడు తుపాకులు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
● బిహార్, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాది నుంచి నగరానికి వస్తున్న ఆయుధాలకు సంబంధించి తాజా ఉదాహరణలివి. ఈ ఆయుధాలతో పాటు ఆ దందాలు చేసేవారిపైనా పూర్తి స్థాయిలో నిఘా ఉండటం లేదు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ నాటు తుపాకులు లభిస్తున్నాయి. దీంతో నేరగాళ్లు వీటిని వినియోగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గచ్చిబౌలిలో కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్‌కు ఘరానా నేర చరిత్ర ఉంది. అయితే అతడు ఆయుధం వినియోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
– సాక్షి, సిటీబ్యూరో
నాటు ఆయుధాల ధరలు ఇలా..
తపంచా: రూ.5 వేల నుంచి రూ.8 వేలు
రివాల్వర్: రూ.25 వేల నుంచి రూ.50 వేలు
పిస్టల్: రూ.30 వేల నుంచి రూ.60 వేలు
ఆటోమేటెడ్ పిస్టల్: రూ.80 వేలకు పైగా..
ఆటోమేటెడ్ రివాల్వర్: రూ. 90 వేలకు పైగా
(విశ్వసనీయ సమాచారం ప్రకారం)
Comments
Please login to add a commentAdd a comment