గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పెంపు
షాద్‌నగర్‌రూరల్: గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని కమ్మదనం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత ఆదివారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 1 వరకు అవకాశం ఉండగా ఈ నెల 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి, గౌలిదొడ్డి, అలుగునూరు సీఓఈలో 9వ తరగతి, ఖమ్మం, పరిగి ఎస్‌ఓఈలో 8వ తరగతి రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్‌గిరి ఫైన్‌ఆర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు రూ.100 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గురుకులాల ప్రవేశ పరీక్షకు కులం, ఆదాయం, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 23 ఫిబ్రవరి 2025న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవకాశాన్ని ఆసక్తి కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మున్సిపల్ కార్మికుల
సమస్యలు పరిష్కరించాలి
చేవెళ్ల: మున్సిపల్ కార్మికులకు జీఓ నం. 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలోని కార్మికులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటంతోపాటు పర్మినెంట్ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్, అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్స్ గుర్తింపు కార్డులు అందించాలని, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు. 30 ఏళ్లుగా కార్మికులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, వారి శ్రమను ప్రభుత్వం గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సీఐటీయూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎల్లయ్య, నరేశ్, దస్తగిరి, జనార్దన్, నర్సింహ, కిష్టయ్య, బుచ్చయ్య, చేసమ్మ వెంకటయ్య, మల్లమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవం
మాదాపూర్: గాత్ర కచేరీతో గురుకుల విద్యార్థులు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా దేశ విదేశాలకు చెందిన 600 మంది సంగీత కళాకారులు శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో కలిసికట్టుగా త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తన లను ఆలపించారు. సంస్కృతి ఫౌండేషన్ ప్రసిద్ధ కర్ణాటక వయోలిన్ విద్వాంసులు నాద సుదర్ణవ పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామిని గురుసన్మానంతో గౌరవించుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని సంస్కృతి ఫౌండేషన్ తరఫున గండపెండేరాన్ని బహూకరించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వానరానికి అంత్యక్రియలు
దుద్యాల్: వానరానికి అంత్యక్రియలు చేసిన ఘటన మండలంలోని హస్నాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయికోటి కుటుంబ సభ్యులు సాయప్ప, వెంకటప్ప, శేఖర్, ఆరుణ్‌కు గ్రామ శివారులో పొలం ఉంది. ఉదయం వారు పొలానికి వెళ్లగా చెట్టు కింద వానరం కళేబరం కనిపించింది. దీంతో వారు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment