కలెక్టర్, ఎస్పీతో కలిసి సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రాబోతుంది. దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యంతో ఇటు ఆర్థికంగా, అటు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్‌చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి ఫలితంగా ఆధునిక శస్త్ర చికిత్సలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్రూంలను ప్రారంభించి, అనంతరం 11 గంటలకు పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే వెల్లడించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసి జీఓ ఎంఎస్ 82 జారీ చేసిందన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.184.87 కోట్లు మంజూరైంది. ఈ మొత్తం వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన 75 శాతం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుంది.
సివిల్ వర్క్స్ నిర్మాణం మరియు పరికరాలు, ఫర్నిచర్ మరియు ల్యాబ్‌ల సేకరణ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నియంత్రణలో 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్రచికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
ఆస్పత్రి నిర్మాణ వివరాలు..
గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మూడు అంతస్తుల్లో 93 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.
వార్డులు...
ఎన్‌ఐసీయూ వార్డ్, డయాలసిస్, కార్డియాక్, ఎంఐసీయూ, న్యూరో, కార్డియాక్ ఐసీయూ, ఎన్‌ఎస్‌ఐసీయూ, గైనకాలజీ, సర్జరీ వార్డ్, జనరల్ మెడిసిన్ వార్డులు ఉంటాయి.
ల్యాబ్ వివరాలు...
మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, బ్లడ్ బ్యాంక్, క్యాత్ ల్యాబ్‌లు ఉండనున్నాయి.
శంకుస్థాపనకు సిద్ధం..
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పటాన్‌చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేశారు.ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కనే గల రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అందుబాటులో ఉండే వైద్య సేవలు..
జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment