సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి బీఆర్‌ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 200 మంది అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి వంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
చింతాకే అవకాశం ఇవ్వండి
పార్టీలోకి వలస వచ్చే వారికి కాకుండా, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌కే అవకాశం కల్పించాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్న చింతాకు తమ మద్దతు ఉంటుందని సుమారు 80 శాతం మంది ముఖ్యనేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వానికి విన్నవించాలని నిర్ణయించారు.
మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని అన్నారు. కాగా కొందరు నేతలు ఇందుకు భిన్నంగా తమ అభిప్రాయం వెల్లడించారు. పార్టీ అధినాయకత్వం ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వారి గెలుపు కోసమే తాము పనిచేస్తామని కొండాపూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, గుంతపల్లి సర్పంచ్ అనంత్‌రెడ్డి తదితర నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం తమ పేరును కూడా పరిశీలించాలని డాక్టర్ శ్రీహరి విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డిలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు
సమావేశం ఆర్గనైజ్ చేసిందెవరు?
సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఒకింత కలకలం రేపింది. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిందెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా పార్టీ మండల, పట్టణ కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ముఖ్య నాయకులందరికీ ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంగళవారం రాత్రే సమాచారం ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఇది ఒక మేలు కలయికే: చింతా ప్రభాకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీఆర్‌ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రతినిధి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌ను ఫోన్‌లో సంప్రదించగా నాయకులంతా అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. జగ్గారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయనతో విభేదించి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటనే అభద్రతా భావంతో ఉన్నారు. అందుకోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment