![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/1/Atthaa%20kodallu.jpg.webp?itok=8DSt69QR)
సంగారెడ్డి: ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో మహిళ మృతదేహం లభ్యం కాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ.నరేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మళి మహాదేవి(35), భర్త శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రతి రోజూ తాగేవాడు.
దీంతో ఆరోగ్యం దెబ్బతింది. జీవితంపై విరక్తి చెందిన శేఖర్ రెండు నెలల క్రితం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి మహాదేవి డిప్రెషన్‌లోకి వెళ్లింది. మనోవేదనకు గురై నిత్యం బాధపడుతున్న ఆమె ఆదివారం గ్రామ శివారులోని ఎల్లమ్మ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శవాన్ని బావిలో నుంచి తీసి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి అత్త మామ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాగుడుకు బానిసై..
ఇదే గ్రామానికి చెందిన ఆలిగే నర్సింలు(44) తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడేవాడు. వారం రోజుల నుంచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అంటుండేవాడు. ఆదివారం ఉదయం భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా గ్రామ శివారులోని సత్వార్ వ్యవసాయ బావి వద్ద బట్టలు, చెప్పులు కనిపించాయి. వీటి ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నాడని భావించి భార్య నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ నరేశ్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి వెతికినా దొరకలేదు. బావిలో నిండుగా నీరు ఉండడంతో రెండు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment