తప్పులుంటే తిప్పలే | - | Sakshi
Sakshi News home page

తప్పులుంటే తిప్పలే

Published Thu, Apr 18 2024 10:35 AM | Last Updated on Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అఫిడవిట్‌ తప్పసరి
● అన్ని కాలమ్స్‌ పూరించాల్సిందే ● నేర సమాచారం ఇవ్వాలి ● ఆస్తులు, అప్పులు పక్కాగా సమర్పించాలి ● ఫారమ్‌ 26 అసంపూర్తిగా ఉంటే తిరస్కరణ

నారాయణఖేడ్‌: లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమయ్యింది. ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమ ర్పించే అఫిడవిట్‌ కీలకంగా మారుతోంది. అభ్యర్థులు తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి ప్రమాణ పత్రం రూపంలో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్ష పడినా వాటినీ పొందుపరచాలి. వీటన్నింటినీ కలిపి దాఖలుచేసే పత్రమే అఫిడవిట్‌. అందులో తప్పుడు సమాచారమిస్తే మాత్రం అదే ప్రత్యర్థులకు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లటమే కాకుండా అనర్హత వేటుకు దారితీయొచ్చు.

ఆస్తులు, అప్పులను ప్రస్తావించాల్సిందే!

స్థిర, చరాస్తుల వివరాలతోపాటు చేతిలో, బ్యాంకు అకౌంట్‌లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వంటి వాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించాలి. అవి వారసత్వంగా వచ్చాయా, కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్‌ విలువను పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలనూ ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు తెలియజేయాలి.

సమాచారం లేకపోతే నోటీసు

అఫిడవిట్‌లోని ఏఒక్క కాలమ్‌ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేకపోతే కాలమ్‌ నిల్‌ లేదా వర్తించదు అని రాయాలని తెలిపింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ ను గమనించి ఏదైనా సమాచా రం లేకపోతే ఆర్‌వో నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్‌ను అభ్యర్థి అందించాలి. అయినప్పటికీ పూర్తిస్థాయి వివరాలతో అఫిడ విట్‌ లేకపోతే స్కృటినీ సమయంలో నామినేషన్‌ తిరస్కరణకు గురవు తుంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఆర్‌ఓలు నోటీసు బోర్డు, వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

కేసులు పొందుపర్చాలి

క్రిమినల్‌ కేసులు నమోదై ఉంటే వాటి వివరాలను అఫిడవిట్‌లో పొందుపర్చాలి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించి నా, అప్పీల్‌కు వెళ్లినా వాటి సమాచారాన్ని ప్రస్తావించాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌ కు నోటరీ తప్పనిసరి. నామినేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) ముందు అభ్యర్థి ప్రమాణం చేస్తారు. వేరే ఎవరైనా నామినేషన్‌ సమర్పిస్తే సదరు అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్‌ ముందు ప్రమాణం చేయాలి. కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.

ఓటర్లు తెలుసుకోవాలి

ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందులో భాగంగానే అభ్యర్థులు తమ నామినేషన్‌తోపాటు అఫిడవి ట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫామ్‌ 26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్‌ సమర్పించాలి. ఇందులో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కేసుల సమాచారంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement