తగ్గిన ‘రియల్’ బూమ్
● పడిపోతున్న ప్లాట్ల అమ్మకాలు ● ఆందోళన చెందుతున్న వ్యాపారులు
ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచిన తర్వాత ప్లాట్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ధరణి సమస్యలు, డీటీసీపీ వెంచర్ల అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్ చార్జీలు, ల్యాండ్ వ్యాల్యూ పెంపులాంటి కారణాల వల్ల ప్లాట్లు, ఇళ్ల అమ్మకాలు 50% తగ్గిపోయింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు కూడా భారీ తగ్గిపోయాయి. ప్రధాన రహదారులవెంట కూడా ఏడాది నుంచి క్రయ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. ప్రభుత్వ పెంచిన పన్నుల ప్రభావం రియల్ దందాపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. గుర్తింపు లేని, అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయవద్దని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడంతో కూడా గుర్తింపు లేని లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వ్యాపారంపై ప్రభావం చూపుతోంది.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రాంతంలో ఏడాది వరకు జోరుగా సాగిన రియల్ బూమ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. ఏడాది వరకు జోరుగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు పూర్తిగా కుదేలైపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ధరణి సమస్యలు, డీటీసీపీ వెంచర్ల అనుమతుల, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త ఉత్తర్వులకు తోడు ఇటీవలే ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచడం వంటి అనేక అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయంటున్నారు రియల్ వ్యాపారులు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల అమ్మకాలు కూడా అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన భూములు,ప్లాట్లు అమ్ముకోలేకపోతున్నారు. అమ్మకాలు లేక చలామణి తగ్గి మార్కెట్‌లో డబ్బులు లేకుండా పోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
నాడు నిమ్జ్ మంజూరుతో రియల్ జోరు..
జహీరాబాద్ ప్రాంతానికి జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) మంజూరు కావడంతో గతేడాది వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా జోరుగా సాగింది. నియోజకవర్గంలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 12,635 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి, రెండు విడతలుగా 5 వేల ఎకరాల వరకు భూమిని సేకరించింది. నిమ్జ్ వల్ల ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని ప్రచారం జరగడంతో భూముల ధరలు రెక్కలు తొడిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. ప్రజలు కూడా ప్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. జహీరాబాద్ నియోజకవర్గంతోపాటు పట్టణం చుట్టూఉన్న రంజోల్, హుగ్గెల్లి, దిడ్గి, ఖాసీంపూర్, అల్లీపూర్, పస్తాపూర్, హోతి(కె) హోతి(బి), చిన్న హైదరాబాద్, దిడ్గి, కోత్తూర్(బి), అల్గోల్ తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు పుట్టుకొచ్చాయి. న్యాల్‌కల్ మండలంలోని హత్నూర్, న్యాల్‌కల్, గంగ్వార్, హుసెళ్లి, మెటల్‌కుంట, ఝరాసంగం, రాయికోడ్, కోహీర్ మండల పరిధి గ్రామాల్లో ఇప్పటికీ కొత్త కొత్త వెంచర్లు వేస్తూనే ఉన్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలన్నీ వెంచర్లుగా మారిపోయాయి. నిమ్జ్ ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ దందా ఊపందుకోవడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.
కొనడానికి ముందుకు రావడంలేదు
కొన్నేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వ్యాపారులకు ప్రజలతో మంచి పరిచయాలు న్నాయి. గతంలో నెలకు రెండు మూడు ప్లాట్లు అమ్మేవాడిని. ఈ మధ్య మార్కెట్ బాగా స్లో అయిపోయింది. నాలుగైదు నెలల నుంచి ఒకటి రెండు మాత్రమే అమ్మగలిగాను. ప్లాట్‌లు కొనడం కోసం తిరిగే వాళ్లు కూడా ఇప్పుడు రావడంలేదు.
– సతీశ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, జహీరాబాద్
Comments
Please login to add a commentAdd a comment