మూడోరోజు కొనసాగిన క్రీడాపోటీలు
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 10వ జోనల్ 2024–25 స్పోర్ట్స్‌మీట్‌లో భాగంగా 6వ చార్మినార్ జోనల్‌స్థాయి బాలుర క్రీడాపోటీలు మూడవరోజైన బుధవారం కూడా కొనసాగాయి. జోన్ పరిధిలోని 11 గురుకులాల బాలురు పోటీల్లో పాల్గొన్నారు. స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి సందర్శించి క్రీడా పోటీలను తిలకించారు. విద్యతోపాటు క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మూడురోజులపాటు జరిగిన క్రీడలపోటీల్లో విజయం సాధించిన వారిని అభినందించారు. కాగా, బాలలదినోత్సవం సందర్భంగా గురువారం బహుమతుల ప్రదానోత్సవం జరుగనుంది. డీఎస్పీ వెంట స్థానిక గురుకులం ప్రిన్సిపల్ లింగారెడ్డి, 11 గురుకులాల ప్రిన్సిపల్స్, పీడీలు, పీఈటీలు ఉన్నారు.
ఎంఈఓల కు ప్రభుత్వ వాహనం కేటాయించాలి
● ఎస్‌టీయూ జిల్లా ప్రధాన
కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ డిమాండ్
పటాన్‌చెరు టౌన్: మండల విద్యాధికారు(ఎంఈఓ)లకు ప్రభుత్వ వాహనం కేటాయించాలని ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ డిమాండ్ చేశారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...మండల విద్యాధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు, నోడల్ ఆఫీసర్ గా, గ్రామ స్పెషల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎంఈఓ లకు ప్రభుత్వ వాహన సౌకర్యం కల్పించాలన్నారు. ఎంపీడీవోలకు, తహసీల్దార్లకు ప్రభుత్వం వాహన సౌకర్యం ఇతర అలెవెనన్స్‌లు చెల్లుస్తున్నట్లే ఎంఈఓలకు కూడా అలాంటి సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటి జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి
● జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్
సంగారెడ్డి జోన్: విధి నిర్వహణలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం ఆవరణలోని బుధవారం పరేడ్ గ్రౌండ్స్‌లో ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పరేడ్ నిర్వహించి, డ్రిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తిగత లేదా డ్యూటీ పరంగా ఎలాంటి సమస్యలున్న అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా జిల్లా పోలీసుశాఖ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, ఆర్మ్‌డ్ రిజర్వ్ డిఎస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రాజశేఖర్‌రెడ్డి, డానియెల్, ఆర్.ఎస్‌ఐలు ఉన్నారు.
ధారూరు జాతరకు పాదయాత్ర
జహీరాబాద్ టౌన్: వికారాబాద్ జిల్లాలో ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. రాష్ట్ర సరిహద్దు కర్నాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన ధారూరుకు వస్తున్నారు. జహీరాబాద్–బీదర్ రహదారి పొడవునా బుధవారం పాదయాత్రికులు కనిపించారు. ప్రతి సంవత్సరం ధారూరులో పెద్ద ఎత్తున మెఽథడిస్టు క్రిస్టియన్ జాతర జరుగుతోంది. కర్నాటక నుంచి భక్తులు కాలినడకన వెళ్లి ఉత్సవాల్లో పాల్గొంటారు. పాదయాత్రలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. కాలినడకన వెళ్తున్న భక్తులకు మండలంలోని బూచినెల్లి గ్రామానికి చెందిన ఎ.శ్రీనివాస్ మిత్ర బృందం అన్నదానం చేసి, రాత్రి బస కోసం ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment