విరాళం పేరుతో నయా మోసం
మిరుదొడ్డి(దుబ్బాక): గుర్తు తెలియని వ్యక్తులు విరాళం పేరుతో నయా మోసానికి తెరలేపారు. అన్నదాన సత్ర నిర్మాణానికి విరాళం ఇవ్వాలంటూ ఓ రైతుకు మాయ మాటలు చెప్పి విరాళంతో ఉడాయించారు. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తీపిరెడ్డి దుర్గారెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శ్రీశైలం ఆలయంలో అన్నదానం, సత్రం నిర్మాణానికి గ్రామంలో ఒక్కొక్కరి వద్ద సుమారు రూ. 20 వేల వరకు విరాళాలు సేకరిస్తున్నామంటూ పరిచయం చేసుకున్నారు. తనకు అంత స్థోమత లేదని రూ.500 విరాళం ఇస్తానని చెప్పాడు. గ్రామంలో చాలా మంది ఇచ్చారు మీరు కూడా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక బాధితుడు వరి కోత కోసం తెచ్చి పెట్టుకున్న డబ్బుల్లో రూ.5 వేలు ఇచ్చాడు. అనంతరం గ్రామంలో ఎవరైనా విరాళం ఇచ్చారా అని ఆరా తీయగా.. విరాళాల పేరుతో గ్రామంలోకి ఎవరూ రాలేదని తోటి గ్రామస్తులు తేల్చి చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. దుర్గారెడ్డికి అనుమానం రావడంతో వారు ఇచ్చిన రసీదులోని నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు గ్రామస్తులతో కలిసి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బోయిని పరుశరాములు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తులు రైతుకు టోకరా
రూ.5 వేలు తీసుకొని ఉడాయింపు
Comments
Please login to add a commentAdd a comment