తగ్గిన దిగుబడి.. పెరిగిన అప్పులు
మునిపల్లి(అందోల్): వ్యాయ ప్రయాసాల కొర్చి ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. పంటచేతి కొచ్చిన సమయంలో తూఫాన్ రూపంలో వర్షాలు పడడంతో పంట దిగుబడి సగానికి పైగా తగ్గిపోయింది. అలాగే పత్తి తెంపడానికి కూలీల కొరత ఏర్పడింది. కిలోకి రూ.11 నుంచి రూ.12 వరకు ఇచ్చి కూలీలను పిలిపిస్తున్నారు. కూలీలు ఇంటి నుంచి గ్రామాలకు రాను పోను ఖర్చు, ఉండడానికి వారు వచ్చిన నుంచి పోయే దాక ఇతరాత్ర ఖర్చులన్నీ రైతులే భరిస్తున్నారు. కూలీలకు టార్పాలిన్లు, తినడానికి కలిపి మరో రూ.3 ఖర్చు అదనంగా అయ్యి మొత్తంగా కిలో రూ.15 లెక్కన రైతులపై భారం పడుతుంది.
పెట్టుబడి కూడా రాని పరిస్థితి..
ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల పత్తి రావడంతో పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి రావడమే కష్టంగా మారింది. పత్తి దిగుబడి సాధించాలనే లక్ష్యంతో రైతులు అన్ని రకాల ఎరువులు, పిచికారీ మందులు, సమయానికి కలుపుతీత పనులను నిర్వహించారు. పత్తి తెంపే సమయంలో క్వింటాల్‌కు బయట మార్కెట్‌లో దళారులు రూ.6,500 నుంచి రూ.6,900 వరకు కొనుగోలు చేస్తున్నారు. పాస్‌పుస్తకాలు ఉన్న రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,300 వరకు కొనుగోలు చేస్తున్నట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. కానీ ఇంకా ధర పెరుగుతుందని కొంత మంది రైతులు పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచుతున్నారు.
ఎకరానికి రూ.20 వేల పైనే ఖర్చు
వర్షాలతో పంట దిగుబడి 70 శాతం తగ్గి పోయింది. పంట దిగుబడి కోసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఒక వైపు దిగుబడి రాక.. మరోవైపు ధర లేకపోవడంతో నిరాశలో కొట్టు మిట్టాడుతున్నాం. విత్తనాలు, ఎరువులు, కలుపుతీత, పురుగు నివారణ మందు పిచికారీ, పత్తి పంట తెంపే కూలీల ఖర్చులతో ఎకరాకు రూ.20 వేలపైనే ఖర్చు అయ్యింది. –బోయిని శ్రీనివాస్, తాటిపల్లి
భారీగా పడిపోయిన పత్తి ఉత్పత్తి
క్వింటాల్‌కు రూ.6,700
ధర పెరుగుతుందని ఇంట్లోనే నిల్వ
ఆందోళనలో రైతులు
Comments
Please login to add a commentAdd a comment