ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
48 గంటల్లో రైతులకు డబ్బులు జమ చేయాలి: కలెక్టర్
సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం చౌటుకూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను ఆమె తనిఖీ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ధాన్యం బస్తాల లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, సంబంధిత మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కాగా, అనంతరం చౌటుకూరు మండల కేంద్రంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
గిరిజనులకు మెరుగైన మౌలిక వసతులు
సంగారెడ్డి జోన్: గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ధర్తిఆబా జన జాతీయ గగ్రామ్ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి, తాగునీరు, వైద్య సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment