రామలింగేశ్వర ఆలయంలో మంత్రి సురేఖ పూజలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండల పరిధిలోని నందికంది రామలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయ కమిటీ,అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
సంగారెడ్డి టౌన్ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో మల్లికార్జునస్వామి దేవాలయాన్ని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు దీపారాధన, అభిషేకాలు చేశారు. ముఖ్యంగా మహిళలు తులసి మొక్కకు పూజలు చేసి శివాలయాల్లో కార్తీకదీపాలను వెలిగించారు.
గణేష్ గడ్డ దేవస్థానంలో
లక్ష దీపోత్సవం
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకుల బృందం, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మాలల
ఆత్మీయ సమ్మేళనం
జహీరాబాద్ టౌన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మాల మహనాడు జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ దీపక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలోని మాల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి ఆర్టీసీ డిపో పరిధిలో శనివారం రోజు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందని డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని జిల్లా పరిధిలోని ప్రయాణికులు వారి సమస్యలను, సలహా సూచనలను 99592 26267 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శివలింగానికి అభిషేకం చేస్తున్నమంత్రి సురేఖ
Comments
Please login to add a commentAdd a comment