ఒక్కసారి నాటు.. 30 ఏళ్లు పంట ‘పట్టు’
ఏడాదికి ఎనిమిది పంటలు
● జిల్లాలో పెరుగుతున్న మల్బరీ సాగు ● తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
సంగారెడ్డి జోన్: పట్టు చీర కడితేనే ఓ పుత్తడి బొమ్మ... ఆ కట్టుబడికే తరించేను పట్టు పురుగు జన్మ అంటూ పట్టుచీరపైనా, కట్టుకున్న మగువపైనా, ఆ చీరనందించిన పట్టుపురుగుపైనా అద్భుతమైన పాటను రాశాడో సినీ కవి. అంతెందుకు పట్టుచీరలంటే మగువలకెంత మక్కువో తెలియనిదెవరికీ? అలాంటి పట్టు చీరలనందించే పట్టు పురుగుల పెంపకం (మల్బరీ సాగు) ఇప్పుడు మంచి కాసులు కురిపిస్తోంది. అంతేనా! ఒక్కసారి నాటితే ఏకంగా 30 ఏళ్ల పాటు పంట వస్తుందని సాగు చేస్తోన్న రైతులు చెబుతున్నారు. మూడో సంవత్సరం నుంచి ఏడాదికి ఎనిమిది పంటలు వరకు తీయవచ్చని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే మల్బరీ సాగు పట్ల అందుకే రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రస్తుతం 170 ఎకరాల్లో..
జిల్లాలో 2014లో ప్రారంభమైన పట్టు పరిశ్రమ సాగు నేడు జిల్లా వ్యాప్తంగా 170 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగవుతోంది. మరో 20 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగు పెంపొందించేందుకు రైతులకు పంట విధానంతోపాటు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ అందించే రాయితీలపైనా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నీటి సౌకర్యం కలిగి ఉన్న నల్లరేగడి, చౌడు మినహా అన్ని భూములు మల్బరీ సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు.
ఏడాదికి 7 నుంచి 8 పంటలు
బహు వార్షిక పంటైన మల్బరీ మొక్క ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు పంట ఉంటుంది. సాగు కొరకు నీటి సౌకర్యం తక్కువగా ఉంటుందని, సంవత్సర కాలంలో 7 నుండి 8 పంటలతో దిగుబడులు అధికంగా వస్తాయి. పంట సాగు నిర్వహణ సక్రమంగా ఉంటే తక్కువ ఖర్చు అధిక లాభాలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. మొదటి సంవత్సరం 2 నుండి 3 పంటలు రాగా రెండో సంవత్సరంనుంచి 7 లేదా 8 పంటలు వస్తాయి.
కేజీ రూ.600 పలుకుతున్న పట్టు
పట్టుపురుగుల గూళ్ల తయారీ అనంతరం వాటి నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. కరోనా సమయంలో కేజీ పట్టు ధర రూ.200 నుంచి రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.600వరకు పలుకుతోంది. దీంతోపాటు రైతుకు అదనంగా కేజీకి రూ.75 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. ఇక రైతులు సాగుచేసిన పట్టుగూళ్లు అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని తిరుమలగిరి, వరంగల్ జిల్లాలోని జనగామలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది.
సాగుకు కనీసం రెండెకరాలు...
కనీసం రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చేయాలి. తోట పరిసర ప్రాంతంలో 20 ్ఠ 50 సీడ్స్ షెడ్డును ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణం , పరికరాలకు సిల్క్ సమగ్ర పథకం–2లో భాగంగా కేంద్రం రాయితీని అందజేస్తోంది. రెండు ఎకరాల్లో పట్టుపురుగుల పెంచేందుకు మల్బరీ మొక్కలు నాటి 250 గుడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పురుగులకు ఆకు కోసి వేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న షెడ్డులో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. చంద్రికల నుంచి పట్టుగూళ్లను వేరు చేసి మార్కెట్‌కు తరలించుకోవచ్చు. ఇలా మల్బరీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తే స్థిరమైన అధిక ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment