సిరూర్, దౌల్తాబాద్ గ్రామస్తుల ఆందోళన
రాయికోడ్(అందోల్): అసంపూర్తిగా ఉన్న అల్లాదుర్గం–మెటల్‌కుంట ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేయాలని మండలంలోని సిరూర్, దౌల్తాబాద్ గ్రామస్తులు ఆదివారం ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా కంపచెట్లు, ద్విచక్ర వాహనాలను అడ్డంగా ఉంచి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకర వేసి వదిలేయడంతో దుమ్ము ధూళి వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, నివాస గృహాల్లోకి దుమ్ము చేరి ఆహార పదార్థాలు పడవుతున్నాయన్నారు. పక్కనున్న పంటలపైనా పేరుకుపోయి దెబ్బతింటున్నాయన్నారు. పనులు నిలిపోవడం వల్ల వాహనదారులు తరుచూ ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారన్నారు. దుమ్ము లేస్తున్న రోడ్డుపై కనీసం ట్యాంకర్ నీటితోనైనా తడపాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు సిబ్బందితో అక్కడికి చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు. అడ్డుగా ఉంచిన వాహనాలు, ముళ్లకంపను తొలగించారు. వాహన రాకపోలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
రహదారి నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పనులు అర్ధంతరంగా నిలిపేయడంపై ఆగ్రహం
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment