కలవని చేతులు!
● సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల
సమన్వయ లోపం
● పటాన్‌చెరు ముఖ్యనేతల్లోను
కుదరని సయోధ్య
● నారాయణఖేడ్‌లోను అదే సీన్
● జహీరాబాద్‌లో మూడు వర్గాలుగా
విడిపోయిన కేడర్
● నేడు కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గతేడాది అధికారంలోకి వచ్చాక కూడా వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. ఆయా చోట్ల రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ క్యాడర్ ఎటువైపు వెళ్లాలనే దానిపై అయోమయం నెలకొంది. ఒక్క అందోల్ నియోజకవర్గం మినహా జిల్లాలో మిగిలిన నాలుగు చోట్ల అంతర్గత పోరు ఉంది. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ హాజరుకానున్నారు. మంత్రులతో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ల రాష్ట్ర చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
జహీరాబాద్‌లో మూడు వర్గాలు
జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డిలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్ కూడా తన కార్యాలయాన్ని ఇక్కడే ప్రారంభించడంతో ఈ నియోజకవర్గంలో క్యాడర్ మూడు వర్గాలుగా విడిపోయింది.
సంగారెడ్డిలో ఇలా..
సంగారెడ్డి నియోజకవర్గంలో పాత, కొత్త నేతల దూరం కొనసాగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని పోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులిమామిడి రాజుతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు, పాత నేతలకు మధ్య సమన్వయం లేకుండా పోయింది. పార్టీ కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని పులిమామిడి రాజు వంటి నేతలు వాపోతున్నారు.
పటాన్‌చెరులో ఎవరికి వారే..
పటాన్‌చెరు నియోజకవర్గంలో నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదరడం లేదు. మరోవైపు వీరిద్దరితో మెదక్ ఎంపీగా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధుకు కూడా దూరం పెరిగింది. ఈ నియోజకవర్గంలోను పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదు.
నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ క్యాడర్ మొదటి నుంచి రెండు వర్గాలుగా ఉంది. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇద్దరు కలిసి పనిచేశారు. తద్వారా ఇద్దరు కూడా విజయం సాధించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మండల స్థాయి క్యాడర్ మాత్రం రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ఓ మండలంలో ఈ రెండు వర్గాల నేతలు ఇటీవల చిన్నపాటి గొడవకు దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ విభేదాలు బయటపడలేదు కానీ అంతర్గతంగా మాత్రం రగులుతూనే ఉన్నాయనే అభిప్రాయం ఉంది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. కానీ మిగిలిన నాలుగుచోట్ల కాంగ్రెస్ క్యాడర్ ‘చేతులు’ కలవడం లేదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సోమవారం నిర్వహించనున్న పార్టీ సమీక్ష సమావేశంలో ఆయా నేతల మధ్య నెలకొన్న ఈ వర్గ విభేదాలు బహిర్గతమయ్యే అవకాశాలు లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment