రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లవ్
జోగిపేట(అందోల్): రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్నారు. తాము కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై శాంతియుతంగా పోరాటాలు నిర్వహించామన్నారు. కానీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ నేతలు కలెక్టర్ స్థాయి అధికారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. అందుకు వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు చేసిన కుట్రలు బయటపడగా అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీస్థాయిలో పైరవీలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. 32 వేల ఎకరాలు ముంపునకు గురైతే 1600 మంది రైతులు కోర్టును ఆశ్రయించి ప్రతీకేసును గెలిచారన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే ఇందుకు రైతులు వ్యతిరేకించి శాంతియుతంగా 966 రోజులపాటు దీక్ష చేపట్టి రూ.12 లక్షలకు పరిహారాన్ని పెంచుకోగలిగారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలలోకి వచ్చిన 11 నెలల్లోనే 54 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా చేయబోతున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌లు నిర్మల, గిరిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, మదన్‌రెడ్డి, జగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవ సభలో
మంత్రి దామోదర రాజనర్సింహ
Comments
Please login to add a commentAdd a comment