సర్వే సమాచారం గోప్యం
ప్రజలకు అనుమానాలు వద్దు మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వేలో అనుమానాలు అవసరం లేదని, సమాచారం గోప్యంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలో ఎన్యుమరేటర్‌తో కలిసి సర్వే వివరాలను సేకరించారు. అనంతరం సిద్దేశ్వర గుట్టపై ఉన్న బంజారా భవన్ రోడ్డుకు స్థల పరిశీలన చేశారు. రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్యుమరేటర్లకు ప్రజలు స్వచ్చంధంగా సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇంటింటి సర్వేలో భాగస్వాములు కావాలన్నారు. సర్వే ద్వారా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక వేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సర్వేకు ప్రజలు సహకరించాలి
డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య
చిన్నకోడూరు(సిద్దిపేట): సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చంద్లాపూర్ రామునిపట్ల గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను సందర్శించారు. సర్వే తీరును పరిశీలించారు. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సర్వేలో సంపూర్ణంగా వివరాలు సేకరించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వండి
చిన్నశంకరంపేట(మెదక్): సమగ్ర ఇంటింటి కులగణన సర్వే కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించి మాట్లాడారు. ఎన్యుమరేటర్లు అడిగే వివరాలు పూర్తి గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీఓ దామోదర్, తహసీల్దార్ మన్నన్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment