అర్జీలను తక్షణం పరిష్కరించండి
సిద్దిపేటరూరల్: సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించిన అర్జీలను వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, పెన్షన్లు ఇతరత్రా మొత్తం కలిపి 62 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్థలం కేటాయించండి
హనుమాన్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ కేసీఆర్‌నగర్, నర్సాపూర్ డబుల్‌బెడ్రూం కాలనీ వాసులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఉంటున్న కాలనీలో హనుమాన్ దేవాలయం లేకపోవడంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకుని రావాల్సి వస్తోందన్నారు. ఆలయం లేని ఊరు శ్మశానంతో సమానమని తమ కాలనీలో ఆలయ నిర్మాణానికి అధికారులు ఎలాగైనా స్థలం కేటాయిస్తే తాము ఆలయాన్ని నిర్మించుకుంటామని పేర్కొన్నారు.
ఆమరణ నిరాహార దీక్ష చేపడతా..
సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారి అక్రమంగా పదోన్నతి పొందిన విషయంపై ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోతే 15న మున్సిపల్ గేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆర్టీఐ కార్యకర్త షాదుల్ హెచ్చరించారు. అక్రమంగా పదోన్నతి పొందిన అధికారిని ఉన్నతాధికారులు వెనకేసుకువస్తున్నారని సోమవారం ఆయన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ అధికారి చేసిన అక్రమంపై కలెక్టర్‌తోపాటు, హెడ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అతడిపై చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులపై కూడా కేసులు నమోదు చేసేంతవరకు పోరాడతానని హెచ్చరించారు.
ఎస్టీ హాస్టల్‌లో అన్నీ సమస్యలే..
గజ్వేల్: పట్టణంలోని ఎస్టీ హాస్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు బీమ్‌శేఖర్, భాగ్యరి వేణు ఫిర్యాదు అందజేశారు. హాస్టల్‌లో కనీస సదుపాయాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బాత్రూమ్‌లకు డోర్లు సైతం సక్రమంగా లేవన్నారు. ప్రహరీ లేక పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని హాస్టళ్లల్లో ఇదే పరిస్థితి ఉన్నదని వాపోయారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
రూ.6వేల పెన్షన్ అందించాలి
ఇచ్చిన హామీలో భాగంగా దివ్యాంగులకు వెంటనే రూ.6వేల పెన్షన్ అందించాలంటూ హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్నా హామీ నెరవేరలేదన్నారు. అదేవిధంగా వికలాంగులకు ఉచిత బస్‌సౌకర్యం కల్పించి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment