పరిశ్రమలతో ఉపాధి
● కారిడార్‌కు రైతులు సహకరించాలి
● ఏడాదిలోనే ఎంతో అభివృద్ధి చేశా..
● మంత్రి పొన్నం ప్రభాకర్
● సంబురంగా ప్రజా విజయోత్సవాలు
హుస్నాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, కారిడార్ కోసం రైతులు సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలను నిర్వహించారు. కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారన్నారు. సన్న వడ్లకు రూ.500 ఇస్తామని చెప్పామని, రైతుల ఖాతాలో బోనస్ పడుతోందని తెలిపారు. రూ.2లక్షల వరకు రుణ మాఫీ పూర్తి చేశామని, రుణమాఫీ కానీ వారి కుటుంబ నిర్ధారణ జరుగుతుందని తెలిపారు. 40 శాతం మేర డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు.
రూ.433 కోట్లు కేటాయింపు..
కుర్చీ వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న వారు పూర్తి చేయలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కాలువల నిర్మాణం కోసం రూ.433 కోట్లు కేటాయించామని, మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ సేకరణ జరుగుతోందని తెలిపారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు, హుస్నాబాద్ నుంచి జనగామకు వెళ్లే రోడ్ల విస్తరణ జరుగుతోందన్నారు. ఉపాధి అవకాశాల కోసం సెట్విన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. హుస్నాబాద్‌లో త్వరలో 250 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. భవిష్యత్‌లో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకే సమగ్ర కుల గణన సర్వే జరుగుతోందన్నారు.
3.15 లక్షల కుటుంబాల సర్వే పూర్తి
ప్రజాహితం కోసం ప్రభుత్వం సమగ్ర సర్వే చేపడుతోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 3.25లక్షల కుటుంబాలకు 3.15 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేశామన్నారు. అమ్మ ఆదర్శ కమిటీలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు ఇలా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment