కొనుగోళ్లలో జాప్యం తగదు
అదనపు డీఆర్‌డీఓ మధుసూదన్
సిద్దిపేటరూరల్: వరిధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అదనపు డీఆర్‌డీఓ మధుసూదన్ అన్నారు. సోమవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం చంద్రం, తదితర అధికారులు, పాల్గొన్నారు.
హుస్నాబాద్ డివిజన్‌కు రూ.3.45 కోట్లు మంజూరు
హుస్నాబాద్‌రూరల్: డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు ఉపాధిహామీ పథకం కింద రూ.3.45 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ డీఈ మహేశ్ సోమవారం తెలిపారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి పంచాయతీ భవనానికి, అక్కన్నపేట పెద్దతండా గ్రామ పంచాయతీ భవనానికి, కోహెడ నారాయణపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మానాలకు రూ.20లక్షల చొప్పులన నిధులు మంజూరయ్యాయన్నారు. అలాగే పొట్లపల్లి, శ్రీరాములపల్లి, అక్కన్నపేట అంగన్‌వాడీ భవనాలకు రూ.24 లక్షలు, హుస్నాబాద్ మండలం 14 గ్రామాల్లో సీసీ రోడ్లకు రూ.80లక్షలు, కోహెడ మండలం 13 గ్రామాలకు సీసీ రోడ్లకు రూ.85లక్షలు, అక్కన్నపేట మండలం 13 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.90 లక్షలు విడుదలయ్యాయన్నారు. తోటపల్లి, నాగసముద్రాల, మైసమ్మవాగు తండాప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణాలకు రెండు లక్షల చొప్పున రూ.6లక్షలు నిధులు మంజూరైనట్లు డీఈ తెలిపారు.
రాంచంద్రారెడ్డి పార్థీవదేహానికి నివాళులు
కొండపాక(గజ్వేల్): ఎమ్మెల్యే హరీశ్‌రావు దొమ్మాట రాంచంద్రారెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాంచంద్రారెడ్డి.. ప్రజాసేవ కోసం నిరంతరం పని చేసి మంచి పేరు సంపాదించుకున్నారంటూ కొనియాడారు. మృతుని కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి సైతం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై
ప్రత్యేక దృష్టి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
సిద్దిపేటకమాన్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ తెలిపారు. అనీమియా ముక్త భారత్‌లో భాగంగా జిల్లాలోని 5, 6, 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న వారిని గుర్తించి నేషనల్ రియాబిలిటేషన్ సెంటర్‌కు పంపించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. వైద్యాధికారులు హాస్టళ్లను సందర్శించి వంటగదిలో పరిశుభ్రత పాటించేలా ఉపాధ్యాయులకు సూచనలు చేయాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment