కొత్త మండలాలకు పూర్తిస్థాయి హోదా
దుబ్బాక: జిల్లాలో కొత్తగా ఏర్పడిన అక్బర్‌పేట–భూంపల్లి, కుకునూరుపల్లి, దూల్మిట్ట మండలాలు ఇక నుంచి పూర్తిస్థాయి హోదా పొందాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 22న కొత్తగా మూడు రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతో ఈ మండలాల్లో కొత్తగా తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ పాలకులు (ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలు), ఎంపీడీఓ కార్యాలయాలు ఇప్పటి వరకు పాత మండలాల పరధిలోనే కొనసాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం పూర్తిస్థాయి మండలాలుగా ప్రకటిస్తూ జీఓ 67 విడుదల చేసింది. అక్బర్‌పేట–భూంపల్లిలో 19 గ్రామపంచాయతీలు, కుకునూరుపల్లిలో 15 గ్రామాలు, దూల్మిట్టలో 11 గ్రామపంచాయతీలతో కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి.
స్థానిక ఎన్నికల్లో కొత్త మండలాల్లోనే..
త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం విడుదల చేసిన జీఓతో కొత్త మండలాల్లోనే జరుగనున్నాయి. ఎంపీటీసీలు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ కొత్త మండలాల పేరిటనే జరుగుతాయి. ప్రభుత్వం పూర్తిస్థాయి మండలాలుగా మండల పరిషత్‌లు ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
క్షీరాభిషేకాలు..
అక్బర్‌పేట–భూంపల్లికి పూర్తిస్థాయి మండలం హోదా కల్పించడంపై బుధవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంటకస్వామిగౌడ్, బాల్తె వెంకటేశం లు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు
అక్బర్‌పేట–భూంపల్లి కొత్త మండలానికి పూర్తిస్థాయి మండలం హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషం. మండల పరిషత్‌తో పాటు అన్ని కార్యాలయాలు ఏర్పాటు అయితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
– బాల్తె వెంకటేశం,భూంపల్లి
సౌకర్యాలు కల్పించాలి
అక్బర్‌పేట–భూంపల్లితో పాటు కుకునూరుపల్లి, దూల్మిట్ట కొత్త మండలాలకు మండల ప్రజాపరిషత్ లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయడం సంతోషం. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలు అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే
అక్బర్‌పేట–భూంపల్లి, కుకునూరుపల్లి, దూల్మిట్ట..
తాజాగా జీఓ
విడుదల చేసిన ప్రభుత్వం
మండల ప్రజాపరిషత్‌లు
ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment