టీమిండియాతో మ్యాచ్ అంటే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ సారథి మొయిన్ ఖాన్ అన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజంకు జట్టులోని సీనియర్లెవరూ సలహాలు ఇచ్చే సాహసం చేయలేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయంతో వెనక్కి తగ్గడం సరికాదంటూ పాక్ ఆటగాళ్లకు హితబోధ చేశాడు.
భారత్ వంటి పటిష్ట జట్టుతో ఆడేటపుడు వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టాలని.. లేదంటే పరాభవాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ఆసియా వన్డే కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.
ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుని విమర్శలపాలైంది. భారత బ్యాటర్లు దంచికొట్టిన పిచ్‌పై పాక్ ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి ఇంటిబాట పట్టిన విషయం విదితమే.
ఇదిలా ఉంటే... ఆసియా టోర్నీలో పరాజయం తర్వాత పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్-2023కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భారత్‌కు చేరుకున్న బాబర్ ఆజం బృందం.. హైదరాబాద్‌లో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతోంది.
ఈ నేపథ్యంలో మొయిన్ ఖాన్ క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లంత బాబర్ ఆజంకు సలహాలు ఇవ్వడానికి భయపడ్డారు. నేనీ మాటను బల్లగుద్ది చెప్పగలను. రిజ్వాన్, షాదాబ్.. షాహిన్ వీళ్లంతా బాబర్‌కు సలహాలు ఇవ్వలేకపోయారు.
జట్టు సమిష్టిగా ఉన్నట్లు కనిపించలేదు. అసలు గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో! ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా వాటిని పాటించడం లేదనే అనిపిస్తోంది. ఎందుకో టీమిండియాను చూస్తేనే పాక్ ఆటగాళ్లు వణికిపోతున్నారు.
అందుకే తాము ఇచ్చిన సలహాలు పనిచేయకపోతే ఫలితం గురించి చింతించక తప్పదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటి భయాలు సహజమే.
కానీ ఆటగాళ్లుగా మనం పూర్తిస్థాయిలో మన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ప్రదర్శించాలి. ప్రతికూల ఫలితం వస్తుందనే భయం ఉన్నా బాడీ లాంగ్వేజ్‌లో దానిని కనిపించనివ్వకూడదు’’ అని మొయిన్ ఖాన్ పాక్ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చాడు.
పాకిస్తాన్ డ్రెసింగ్‌రూం వాతావరణం బాగాలేదేమోనన్న సందేహం వ్యక్తం చేసిన ఈ మాజీ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. విభేదాలు పక్కనపెట్టి ముందుకు సాగితేనే మెగా టోర్నీలో రాణించగలరంటూ మొట్టికాయలు వేశాడు. కాగా ప్రపంచకప్‌లో అక్టోబరు 14న పాకిస్తాన్ అహ్మదాబాద్‌లో టీమిండియాతో తలపడనుంది.
చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం!
Comments
Please login to add a commentAdd a comment