బజ్‌బాల్ అప్రోచ్ విషయంలో, యాషెస్ సిరీస్ నెగ్గే విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో యాషెస్ సిరీస్ గెలుస్తామని ధీమాగా చెబుతున్నాడు. నాలుగో టెస్ట్‌కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టోక్స్ మాట్లాడుతూ.. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచే నాలుగో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి తీరతామని.. ఆసీస్ ఆధిక్యాన్ని 0-2 నుంచి 1-2కు తగ్గించాం, దీన్ని 2-2కు తీసుకువచ్చి, 3-2గా ముగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
నాలుగో టెస్ట్ మొత్తానికి వర్షం ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందిస్తూ.. వాస్తవానికి మేము వాతావరణం గురించి ఆలోచించం. అయితే ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. వరుణుడు ఇబ్బంది పెడితే తమ సాధారణ ఆటలో శృతి పెంచి, ఫలితం సాధిస్తామని చెప్పాడు. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్‌కు ముందు కూడా వర్షం ఇలానే మమ్మల్ని బయపెట్టిందని, అదే తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీసి విజయం సాధించేలా చేసిందని తెలిపాడు.
కాగా, నాలుగో టెస్ట్‌కు వేదిక అయిన ఓల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్‌లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మ్యాచ్ తొలి రోజు (జులై 19) వర్షం పడే అవకాశాలు కాస్త అటు ఇటుగా ఉన్నా, మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో ఓ మోస్తరుకు మించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తమ నివేదికలో పేర్కొంది. వర్షం కురువని సమయంలో గాలి వేగం అధికంగా ఉంటుందని తెలిపింది.
ఇదిలా ఉంటే, వర్షం కురువకుండా గాలి వేగం అధికంగా ఉంటే ఫాస్ట్ బౌలర్లు రెచ్చిపోతారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల కారణంగానే ఇరు జట్లు స్పిన్నర్లను పక్కకు పెట్టి, కేవలం పేస్ దళంతోనే బరిలోకి దిగుతున్నారు. ఆల్‌రౌండర్లతో కలిపి ఇరు జట్లు ఐదుగురు పేసర్లతో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment