విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ (పాత ఫొటో PC: BCCI)
Asia Cup 2023- Rohit Sharma- Virat Kohli: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా సమరానికి బుధవారం(ఆగష్టు 30) తెరలేవనుంది. పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక దాయాదులు భారత్- పాక్ మ్యాచ్‌కు సెప్టెంబరు 2న ముహూర్తం ఖరారైంది.
క్లీన్‌స్వీప్ విజయంతో పాకిస్తాన్
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. శ్రీలంకలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి బాబర్ ఆజం బృందం జోష్‌లో ఉండగా.. జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రెయినింగ్ క్యాంపులో భారత ఆటగాళ్లు నెట్స్‌లో కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తున్నారు.
సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్, కోహ్లి
ఇక గత కొంతకాలంగా వన్డేల్లో పూర్తిస్థాయిలో ఆడకలేకపోయిన టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మెగా ఈవెంట్‌తో రంగంలోకి దిగనున్నారు. వన్డే కప్ టోర్నీలో మెరుపులు మెరిపించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 నేపథ్యంలో రోహిత్, విరాట్ అరుదైన రికార్డు ముంగిట నిలిచారు. ఆసియా టోర్నీ వన్డే ఫార్మాట్లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ 971 పరుగులతో భారత్ నుంచి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ముందు వరుసలో ఉన్నాడు.
ఓవరాల్‌గా మూడో స్థానంలో సచిన్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి 613 పరుగులతో పన్నెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈసారి గనుక ఈ ఇద్దరు బ్యాట్ ఝులిపిస్తే సచిన్ రికార్డు బ్రేక్ చేయడం ఖాయం.
‘విరాహిత్’లో సచిన్ రికార్డు బద్దలు కొట్టేది ఎవరు?
ఈ అరుదైన ఘనతకు రోహిత్ 227 పరుగుల దూరంలో ఉండగా.. కోహ్లి సచిన్‌ను అధిగమించాలంటే 359 పరుగులు చేయాల్సి ఉంది. అన్నీ సజావుగా సాగి మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తే.. ‘విరాహిత్’ ద్వయంలో ఎవరో ఒకరు ఈసారి సచిన్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
కాగా ఈ మెగా ఈవెంట్‌లో గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ టైటిల్ పోరులో తలపడనున్నాయి. అన్నట్లు ఈ ఈవెంట్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడనుంది.
చదవండి: Ind Vs Pak: ఊహించని ట్విస్టు.. ఓపెనర్లుగా గిల్, ఇషాన్! పిచ్చి ప్రయోగం!
Comments
Please login to add a commentAdd a comment