Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్‌ | Australian Open 2024: Sumit Nagal Scripts Grand Slam History Check | Sakshi
Sakshi News home page

Australian Open 2024: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్‌ స్టార్‌

Published Tue, Jan 16 2024 4:48 PM | Last Updated on Tue, Jan 16 2024 6:30 PM

Australian Open 2024: Sumit Nagal Scripts Grand Slam History Check - Sakshi

సుమిత్‌ నాగల్‌ (PC: Aus Open X)

Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్‌-2024లో భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్‌ సింగిల్స్‌లో 137వ ర్యాంకర్‌ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్‌ నెంబర్‌ 27 అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్‌ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సీడెడ్‌ ప్లేయర్‌ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్‌ రికార్డులకెక్కాడు.

కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ తాజా ఎడిషన్‌లో భాగంగా తొలి రౌండ్‌లో.. సుమిత్‌ నాగల్‌.. కజకిస్తాన్‌ టెన్నిస్ స్టార్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్‌ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్‌కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్‌.

రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన సుమిత్‌
మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్‌ మూడో సెట్లో మాత్రం సుమిత్‌ను చెమటోడ్చేలా చేశాడు. 

ఈ క్రమంలో టై బ్రేకర్‌లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్‌.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్‌ నాగల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు.

రమేశ్‌ క్రిష్ణన్‌ తర్వాత
అదే విధంగా.. రమేశ్‌ క్రిష్ణన్‌ తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్‌ ప్లేయర్‌ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్‌ నాగల్‌ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్‌ క్రిష్ణన్‌ ఆనాటి నంబర్‌  వన్‌ ప్లేయర్‌ మ్యాట్స్‌ విలాండర్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్‌ ఆ ఫీట్‌ను నమోదు చేశాడు.

పదేళ్ల వయసులోనే..
హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్‌ నాగల్‌ 10వ ఏటనే టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకున్నాడు. మహేశ్‌ భూపతి మిషన్‌ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు.

వింబుల్డన్‌ బాయ్స్‌ డబుల్స్‌ టైటిల్‌ పోరులో తన వియత్నాం పార్ట్‌నర్‌ లీ హొంగ్‌ నామ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్‌ నాగల్‌ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

ఏకంగా ఫెడరర్‌తోనే
నాటి యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్‌ ఫెడరర్‌తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్‌.. తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్‌కు పోటీనిచ్చిన యంగ్‌స్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగాడు.

చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement