
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు వేగంతో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసి క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళి మజాను అందించారు. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) లక్షీ బాంబుల్లా విధ్వంసం సృష్టించగా.. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చిచ్చుబుడ్లలా మెరుపు హాఫ్ సెంచరీలతో ఎగిసిపడ్డారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది.
వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ 400 అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం ఇది రెండోసారి. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆ స్కోర్‌కు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. ఇదే ఎడిషన్‌లో సఫారీలు శ్రీలంకపై 428 పరుగులు చేశారు. వరల్డ్‌కప్ టాప్-5 అత్యధిక స్కోర్లలో భారత్ రెండు స్థానాల్లో (413, 410) ఉండటం విశేషం.