ICC Cricket World Cup Qualifiers 2023 SCO Vs NED: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్‌కు వచ్చే రెండు జట్లేవో తేలిపోయింది. మాజీ చాంపియన్ శ్రీలంక ఇంతకుముందే అర్హత సాధించగా, ఇప్పుడు నెదర్లాండ్స్ తమ చోటును ఖాయం చేసుకుంది. తప్పనిసరిగా నెగ్గాల్సిన గురువారం నాటి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్లతో స్కాట్లాండ్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ అసాధారణ రీతిలో
బ్రెండన్ మెక్‌ములన్ (106; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. బాస్ డి లీడె (5/52) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావాలంటే 44 ఓవర్లలోనే లక్ష్యం సాధించాల్సిన స్థితిలో నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. ఆ జట్టు 42.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు సాధించింది.
బాస్ దంచికొట్టాడు
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బాస్ డి లీడె (92 బంతుల్లో 123; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... విక్రమ్‌జిత్ సింగ్ (40), సాఖిబ్ జుల్ఫికర్ (33 నాటౌట్) రాణించారు. 36 ఓవర్లు ముగిసేవరకు కూడా మ్యాచ్ స్కాట్లాండ్ నియంత్రణలోనే ఉంది. 8 ఓవర్లలో నెదర్లాండ్స్ 85 పరుగులు చేయాల్సి ఉంది.
తర్వాతి 4 ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 4 ఓవర్లలో 45కు మారింది. ఈ సమయంలో డి లీడె ఒక్క సారిగా టి20 తరహా ఆటను చూపించాడు. వాట్ వేసిన ఓవర్లో 2 సిక్స్‌లు, మెక్‌ములెన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో మొత్తం 42 పరుగులు వచ్చేశాయి. 84 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. డి లీడె రనౌటైనా, వాన్ బీక్ సింగిల్ తీయడంతో డచ్ శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి.
తొలి డచ్ క్రికెటర్‌గా
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ హీరో బాస్ డి లీడె అరుదైన రికార్డు సాధించాడు. డచ్ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు. వన్డేల్లో సెంచరీ సాధించడంతో పాటు ఐదు వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు డి లీడె. గతంలో వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్), రోహన్ ముస్తఫా (యూఏఈ) మాత్రమే ఈ ఘనత సాధించారు.
తొలి ప్లేయర్ వివియన్ రిచర్డ్స్
1987లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వివ్ రిచర్డ్స్ 119 పరుగులు చేయడంతో పాటు 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్‌తో 2005 నాటి మ్యాచ్‌లో పాల్ కాలింగ్‌వుడ్ సెంచరీ సాధించడంతో పాటు ఆరు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. యూఏఈ కెప్టెన్ రోహన్ ముస్తఫా 2017లో పపువా న్యూ గినియాతో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment